సంపద సృష్టి లేదు.. అంతా చెత్తే!
పిఠాపురం: నాడు చెత్త నుంచి సంపద సృష్టించిన కేంద్రాలు నేడు చెత్త తయారీ కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. చెత్త నుంచి సంపద తయారు చేయడానికి రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రాలు ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు, మందుబాబులకు అడ్డాలుగా మారిపోయాయి. చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలు అనేకచోట్ల నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. పలుచోట్ల అరకొర సంపదకే పరిమితమవుతున్నాయి. దీంతో పల్లెల్లో ఎక్కడబడితే అక్కడ చెత్త పోగుపడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ కేంద్రాలు అక్కరకు రాకపోవడంతో ఊరి చివరన చెత్తను పోగు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుపరచడం, చెత్తను వనరుగా మార్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు మందుబాబులకు అడ్డాగా మారి మద్యం బాటిళ్లు, ప్లాస్టిక్ వ్యర్థాలతో దర్శనమిస్తున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని గ్రామాల్లో ఇవి మందుబాబులకు అడ్డాలుగా మారాయి.
గ్రామ శివార్లలో డంపింగ్
అనేక కేంద్రాలలో చెత్త నుంచి సంపద తయారు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో అనేక కేంద్రాలలో సంపద తయారీ అరకొరగానే సాగుతోంది. కొన్ని కేంద్రాల్లో అప్పుడప్పుడూ సంపదను తయారు చేస్తున్నప్పటికీ కొనేవారు ముందుకు రావడం లేదు. చాలా కేంద్రాలు తూతూ మంత్రంగా కొంత చెత్తను పోగు చేసి సంపద సృష్టిస్తున్నట్లుగా లెక్కలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు గ్రామపంచాయతీల్లో చెత్తను గ్రామాల శివార్లలో డంపింగ్ చేస్తున్నారు. దీనివల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. నెలలో ఒకటి రెండు సార్లు చెత్తను తగలబెడుతుండటం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతోంది. విపరీతమైన దుర్వాసన వస్తుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
కానరాని అధికారుల పర్యవేక్షణ
గ్రామాల్లో రోజూ గ్రీన్ అంబాసిడర్లు ఇంటింటికీ వెళ్లి సేకరించిన తడి, పొడి చెత్తతో పాటు వీధుల్లో పేరు కుపోయిన చెత్తను రిక్షాల ద్వారా ఈ కేంద్రాలకు తరలించాలి. అక్కడ తడి, పొడి చెత్తను వేర్వేరుగా కుండీల్లో వేసి వర్మీకంపోస్టు, సేంద్రియ ఎరువు తయారు చేసి రైతులకు తక్కువ ధరకు విక్రయించడం, అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను స్క్రాప్ దుకాణాలకు విక్రయించి పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చాలన్నదే ఈ కేంద్రాల లక్ష్యం. అయితే అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిన నేపథ్యంలో ఈ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దాంతో అనేక సంపద కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయన్న విమర్శలు గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
క్షీణిస్తున్న పారిశుధ్యం
స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు పేరుకే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమాలకు మొదట్లో కొన్ని నిధులు విడుదల అయినప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. తూతూ మంత్రంగా మాత్రమే ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ఆర్థిక సంఘాల నిధుల ఖర్చుపై ఆంక్షలు విధించడం, ఉన్న కాస్త సాధారణ నిధులు అభివృద్ధి పనులకు సైతం చాలకపోవడం వంటి అనేక కారణాల వలన పల్లెలో పారిశుధ్యం బాగా క్షీణిస్తోంది.
అధ్వానంగా పారిశుధ్యం
పలు పంచాయతీల్లో పారిశుధ్యం పూర్తిగా క్షీణిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. శివారు గ్రామాల్లో పారిశుధ్య పనులు అసలు జరగడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం మండలం కోలంక గ్రామంలో 4,657 మంది జనాభా ఉండగా ఈ గ్రామంలో ప్రతీ రోజు సుమారు టన్ను చెత్త తయారవుతోంది. కాని చెత్త సక్రమంగా తీయకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది. ఇక్కడ చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రం మూతపడింది. దీంతో రోడ్లపైనే చెత్త తాండవిస్తోంది. దీంతో దోమలు పెరిగి తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నామని గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. పిఠాపురం మండలం జములపల్లిలో 2100 జనాభా ఉండగా ఇక్కడి పరిస్థితి ఇలాగే ఉంది. గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది. దీంతో గ్రామస్తులు ఆస్పత్రుల పాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, వాకతిప్ప, అమీనాబాద్, కొత్తపల్లి, కొమరగిరి, గొల్లప్రోలు మండలం చేబ్రోలు, వన్నెపూడి, చిన్న జగ్గంపేట, దుర్గాడ, చెందుర్తి, తాటిపర్తి, పిఠాపురం మండలంలో గోకివాడ, మాధవపురం, చిత్రాడ, విరవాడ, మంగితుర్తి తదితర గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మందుబాబులకు అడ్డాగా మారిన పిఠాపురం మండలం కోలంకలోని చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రం
పిఠాపురం మండలం ఎఫ్‌కేపాలెంలో మూతపడిన సంపద తయారీ కేంద్రం
జిల్లాలో ఇలా..
గ్రామ పంచాయతీలు – 385
కుటుంబాలు – 4,85,089
జనాభా – 15,00,798
రోజుకు తయారవుతున్న చెత్త
– సుమారు 50 టన్నులు
సంపద తయారీ కేంద్రాలు
ఉన్న గ్రామాలు – 290
నిరుపయోగంగా
మారిన కేంద్రాలు – 270 కి పైగా
మూతపడిన చెత్త నుంచి
సంపద తయారీ కేంద్రాలు
పేరుకే స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర
పల్లెల్లో ఎక్కడబడితే
అక్కడ దర్శనమిస్తున్న చెత్త
డంపింగ్ యార్డులుగా
మారిన గ్రామ శివారులు
పర్యవేక్షణ లేకే..
చెత్త నుంచి సంపద సృష్టించేందుకు నిర్మించిన కేంద్రాలు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఉపయోగం లేకుండా మారాయి. మా గ్రామంలో నిర్మించిన కేంద్రం కూడా అలాగే ఉంది. సరైన అవగాహన, పర్యవేక్షణ లేక వాటిని ఎవరూ వినియోగించడం లేదు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తే అటు రైతులకు, ఇటు గ్రామ ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది.
– అల్లు వీర ప్రసాద్,
భోగాపురం, పిఠాపురం మండలం
రోడ్లనే చెత్త కేంద్రాలుగా మార్చేశారు
మా గ్రామంలో నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిరుపయోగంగా మారింది. ఈ కేంద్రం నిరుపయోగంగా మారడంతో గ్రామం నుంచి సేకరించిన చెత్త గ్రామ శివారులో రహదారిపై వేస్తున్నారు. రహదారిపై చెత్త వేయడంతో ఆ ప్రాంతమంతా డంపింగ్ యార్డ్‌గా మారి ప్రజల జీవన విధానానికి, వాహనదారులకు ఇబ్బందిగా మారింది. మా కోలంక గ్రామంలో ఉన్న చెట్టు నుంచి సంపద తయారీ కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకువస్తే అటు రైతులకు, ఇటు గ్రామ ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది.
– పెదపాటి రమేష్, కోలంక, పిఠాపురం మండలం
సంపద సృష్టి లేదు.. అంతా చెత్తే!
సంపద సృష్టి లేదు.. అంతా చెత్తే!
సంపద సృష్టి లేదు.. అంతా చెత్తే!
సంపద సృష్టి లేదు.. అంతా చెత్తే!


