అగ్రి గోల్డ్‌ బాధితుల కోసం ప్రత్యేక కోర్టు | - | Sakshi
Sakshi News home page

అగ్రి గోల్డ్‌ బాధితుల కోసం ప్రత్యేక కోర్టు

Feb 19 2026 9:57 AM | Updated on Feb 19 2026 9:57 AM

అగ్రి గోల్డ్‌ బాధితుల కోసం ప్రత్యేక కోర్టు

అగ్రి గోల్డ్‌ బాధితుల కోసం ప్రత్యేక కోర్టు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు విజయవాడలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. సూర్య కళామందిరంలో అగ్రిగోల్డ్‌ బాధితులతో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అగ్రిగోల్డ్‌ సంస్థను మూసివేసి ఈ ఏడాది జనవరి నాటికి 12 ఏళ్లు అయిందని, సమస్య అలాగే ఉందన్నారు. 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది వినియోగదారులు ఉండగా ఒక ఏపీలో 19 లక్షలకు పైగా బాధితులు ఉన్నారన్నారు. తక్షణమే అగ్రిగోల్డ్‌ యాజమాన్యం బినామీ పేర్లతో వారి దగ్గర ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకొని వేలం వేసి, ఈ సమస్యను ఈ ఏడాది ఆఖరి నాటికి పరిష్కరించాలన్నారు. 2015 జనవరిలో అగ్రిగోల్డ్‌ ఆస్తులను పోలీసులు సీజ్‌ చేశారని అప్పటి నుంచి ఆ సమస్యను అలాగే ఉంచారన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో పాటు యాజమాన్యం వైఫల్యం పూర్తిగా కనిపించిందని అందుకే న్యాయం చేయడంలో వారు వెనుకంజ వేస్తున్నారన్నారు. ఇంకా అగ్రిగోల్డ్‌ యాజమాన్యం వద్ద రూ.ఐదు వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వాటికి తక్షణమే వేలం పాట నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. మార్చి రెండో తేదీ నుంచి అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. టీడీపీ మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య పరిష్కరిస్తామని చెప్పిందని, సీఎం చంద్రబాబు దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని ముప్పాళ్ళ డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ – కస్టమర్‌ ఏజెంట్‌ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మేటి రాంబాబు, అర్జున్‌ రావు, నారాయణరావు బాధితులు పి.నరేష్‌కుమార్‌, పి నరసింహమూర్తి, మండ వీరరాఘవ, పీవీఎస్‌ నారాయణ పాల్గొన్నారు.

సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు

ముప్పాళ్ళ డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement