కొత్త అక్విడెక్టుపై రాకపోకల బంద్
● 20 రోజుల్లో మరమ్మతులు ప్రారంభం
● పాత అక్విడెక్టు మీదుగా
ట్రాఫిక్ మళ్లింపునకు పరిశీలన
● 40 రోజులపాటు వాహనాల రాకపోకలకు బ్రేక్
పి.గన్నవరం: సీఎస్‌ఆర్ నిధులు రూ.49.03 లక్షల వ్యయంతో పి.గన్నవరం కొత్త అక్విడెక్టుకు 20 రోజుల్లో మరమ్మతులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు ఇరిగేషన్ డీఈఈ భూపతిరాజు ప్రసాద్‌రాజు తెలిపారు. దీంతో 40 రోజుల పాటు కొత్త అక్విడెక్టుపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్టు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రాజోలు దీవి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాత అక్విడెక్టుపై చిన్న తరహా వాహనాల రాకపోకలను మళ్లించేందుకు గురువారం ఆయన డీసీ వైస్ చైర్మన్ చొల్లంగి సత్తిబాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఈ విలేకరులతో మాట్లాడారు. కొత్త అక్డిడెక్టుపై పిల్లర్ల మధ్య ఎక్స్‌పాన్షన్ జాయింట్లు దెబ్బతినడంతో గోతులు ఏర్పడి ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన నిధులు మంజూరు చేశారని డీఈఈ వివరించారు. ఈ పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేశామన్నారు. దెబ్బతిన్న జాయింట్ల వద్ద ఇనుప కడ్డీలు, రబ్బర్ స్ట్రిప్ ఏర్పాటు చేయడంతో పాటు, దెబ్బతిన్న రోడ్డుపై సిమెంట్, కాంక్రీట్‌తో వేరింగ్ కోట్ వేస్తాన్నారు. ఈ పనులు పూర్తి చేసేందుకు 20 రోజులు, అనంతరం వాటర్ క్యూరింగ్‌కు 20 రోజులు పడుతుందన్నారు. మరమ్మత్తులకు మెటీరియల్ అంతా సిద్దమైతేనే కొత్త అక్విడెక్టుపై రాకపోకలు నిలిపివేస్తామన్నారు. ఈ నేపథ్యంలో 40 రోజుల పాటు పాత అక్విడెక్టుపై చిన్న వాహనాల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇస్తామని, భారీ వాహనాలకు అనుమతి ఉండదన్నారు.
ఏటిగట్టుపైకి మార్కెట్ తరలింపు..
ఈ నేపథ్యంలో పాత అక్విడెక్టు మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించేందుకు గాను దారిలో ఉన్న డైలీ మార్కెట్‌ను ఏటిగట్టుపైకి తరలించనున్నట్టు డీఈ ప్రసాద్‌రాజు తెలిపారు. మార్కెట్లో షెడ్లను తొలగించాలని అక్కడి వ్యాపారులకు ఆదేశాలిస్తామని తెలిపారు. అలాగే పాత అక్విడెక్టుపై నిరుపయోగంలో ఉన్న నిర్మాణాలను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం ఏర్పాటు చేస్తామని డీఈఈ వివరించారు. కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు కొల్నాడ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.


