జిల్లా మలేరియా అధికారిగా ప్రభాకర్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా మలేరియా అధికారిగా ప్రభాకర్‌

Nov 2 2025 9:14 AM | Updated on Nov 2 2025 9:14 AM

జిల్ల

జిల్లా మలేరియా అధికారిగా ప్రభాకర్‌

కాకినాడ క్రైం: జిల్లా మలేరియా అధికారి(డీఎంఓ)గా ఇన్‌చార్జి హోదాలో డాక్టర్‌ ఇంజేటి ప్రభాకర్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆ స్థానంలో పని చేస్తున్న డాక్టర్‌ పి.విల్సన్‌ను కాకినాడ పోర్టు వైద్యాధికారిగా నియమించారు. ప్రభాకర్‌ను జిల్లా, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని డీఎంఓ చాంబర్‌లో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన సిబ్బందినుద్దేశించి మాట్లాడుతూ, కాకినాడను దోమల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. మలేరియాను సమూలంగా రూపుమాపాలన్నారు.

తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు

పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలంలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం ఏకాదశి పర్వదినం కావడంతో భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని, స్వామివారికి ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 28 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.2,69,700, అన్నదాన విరాళాలు రూ.1,09,339, కేశఖండన ద్వారా రూ.6,480, తులాభారం ద్వారా రూ.600, లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.26,665 కలిపి మొత్తం రూ.4,12,774 ఆదాయం వచ్చిందని వివరించారు. ఆరు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు.

జనసేన విభేదాలతో అందని

తుపాను సహాయం

శంఖవరం: తుపాను సహాయం పంపిణీలోనూ జనసేనలోని ఇరు వర్గాలు పైచేయి కోసం వివాదానికి దిగారు. దీంతో, తుపాను బాధితులకు సహాయం పంపిణీ కార్యక్రమం కాస్తా వాయిదా పడింది. వివరాలివీ.. కత్తిపూడిలో 20 మంది తుపాను బాధితులకు ఒక్కొక్కరికీ ఒక బియ్యం బస్తా, రూ.5 వేల నగదు పంపిణీ చేసేందుకు విజయవాడ రైల్వే డివిజన్‌ వినియోగదారుల సలహా మండలి సభ్యుడు గొర్లి నాగేశ్వరరావు సన్నాహాలు చేపట్టారు. పార్టీ నియోజకవర్గ బాధ్యతలు తాత్కాలికంగా నిర్వహిస్తున్న మేడిశెట్టి సూర్యకిరణ్‌ (బాబీ) వర్గం ఈ విషయం తెలుసుకుని, ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంది. దీంతో, ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అన్నవరం ఎస్సై సురేష్‌బాబు తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విషయాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఫోనులో మాట్లాడి, పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. ఈ వివాదం నేపథ్యంలో తుపాను సహాయం పంపిణీని వాయిదా వేశారు. దీనిపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సీఎం, డిప్యూటీ సీఎంలపై

విమర్శల పేరిట ఇద్దరిపై కేసు

తొండంగి: ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ పైడికొండ గ్రామానికి చెందిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ గ్రామానికి చెందిన పెండ్యాల పంపారావు, మాగబత్తుల కృష్ణార్జునలు సామాజిక మాధ్యమాల్లో సీఎం, డిప్యూటీ సీఎంలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని తొండంగి ఎస్సై జగన్మోహన్‌రావు శనివారం తెలిపారు. వీరు డ్వాక్రా గ్రూపులను, తిరుపతి వెంకటేశ్వరస్వామిని కించపరిచారంటూ అదే గ్రామానికి చెందిన జాగు గోవిందు, నర్సే వీరస్వామి, పలివెల లోవరాజు, మేడిశెట్టి రామారావులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు పంపారావు, కృష్ణార్జునలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

జిల్లా మలేరియా  అధికారిగా ప్రభాకర్‌ 1
1/1

జిల్లా మలేరియా అధికారిగా ప్రభాకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement