భక్తులకేదీ అభయం!
● ఉమ్మడి జిల్లాలో ప్రముఖ ఆలయాలు ● పోటెత్తుతున్న భక్తులు ● వసతులు మెరుగుపర్చాలని డిమాండ్
● కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో అలెర్ట్ ● పూర్తిస్థాయిలో లేని భద్రత
అంతర్వేది రథయాత్రలో కిక్కిరిసిన భక్తులు (ఫైల్)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వీటిని సందర్శించడానికి రాష్ట్ర నలుమూలల నుంచీ అనేక మంది భక్తులు తరలివస్తారు. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే ఈ ఆలయాలకు ప్రత్యేక మైన రోజుల్లో ఇసుకస్తే రాలనంతగా పోటెత్తుతారు. అయితే ఆలయాలకు వస్తున్న భక్తుల భద్రతకు ప్రభుత్వం ఎంత భరోసా ఇస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందారు. ప్రభుత్వం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాలి.
అంతర్వేది
సఖినేటిపల్లి: అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం ఎంతో ప్రముఖమైంది. ఏటా ఫిబ్రవరిలో (మాఘమాసం) స్వామివారికి వార్షిక దివ్య తిరుకల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు. వీటిలో ప్రధాన ఘట్టాలైన స్వామివారి కల్యాణం, స్వామివారి రథోత్సవం, చక్రవారీ (పౌర్ణమి సముద్ర స్నానం)లకు సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివస్తారు. రథోత్సవంలోనే సుమారు 2 లక్షల మంది పాల్గొంటారు. వీరందరికీ యాత్ర పొడవునా ప్రస్తుతం ఉన్న భద్రత సరిపోవడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ఉత్సవాల్లో పౌర్ణమి స్నానాలు అనంతరం స్వామివారి దర్శనానికి ఆలయానికి వచ్చే అసంఖ్యాకమైన భక్తులు ప్రాంగణంలో కిక్కిరిసి ఉంటారు. వీరందరికీ అరకొరగా భద్రత కల్పిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కార్తిక మాసంలో కూడా ఆలయానికి అయ్యప్ప భక్తులు, సాధారణ భక్తులు పోటెత్తుతారు. ఈ నెలలో సుమారు 2 లక్షల మంది దర్శించుకుంటారు.


