నిండా ముంచిన మోంథా
సాక్షిప్రతినిధి, కాకినాడ: మోంథా తుపాను జిల్లాపై పెద్దగా ప్రభావం చూపించలేదు. ఒకటి, రెండు ఘటనలు మినహాయిస్తే పెద్దగా ప్రమాదాలు కూడా చోటు చేసుకోలేదు. అయితే తుపాను రైతులకు మాత్రం కష్టాల కన్నీళ్లను మిగిల్చిపోయింది. తుపాను కాకినాడ సమీపాన తీరం దాటుతుందనే అంచనాలు తప్పడంతో జిల్లా ప్రజలు ఊరటపొందారు. అయితే వరి, ఇతర ఉద్యాన పంటలు వేసిన రైతులకు మాత్రం ఈ తుపాను అశనిపాతమైంది. జిల్లాలో ఈదురుగాలులు, రెండు రోజులుగా కురిసిన వర్షాలు రైతులను నట్టేట ముంచేశాయి. జిల్లాలో బుధవారం 2.76 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 0.6 సెంటీమీటర్లతో కోటనందూరు మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో నీట మునిగిన పంట అసలు దక్కుతుందా లేదా అనే ఆందోళనలో రైతులున్నారు. పొట్టదశలో ఉన్న వరి పంట వారం, పది రోజులు ఆగితే చేతికొచ్చేసేది. అటువంటి వరి పంట తుపానుతో నీటమునిగి జిల్లాలో రైతులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో 12 నుంచి 15 మండలాల్లో వరితోపాటు ఇతర వాణిజ్య పంటలు ముంపులో ఉండటం రైతులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.
రైతులకు భారీ నష్టం
ఆరుగాలం శ్రమటోడ్చి పండించిన వరికి ఇలాంటి విపత్తు వస్తుందని ఊహించలేదని రైతులు లబోదిబోమంటున్నారు. నారుమడి వేసిన దగ్గర నుంచి ట్రాక్టర్ దమ్ములు చేసి, గట్లంకలు వేసి, కలుపుతీసి నాట్లు వేసి, ఎరువులు వేసి, మందులు పిచికారీ చేసే సరికి ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.40వేలు ఖర్చయిందని, మాయదారి తుపాను నిండా ముంచేసిందని వాపోతున్నారు. ముంపులో ఉన్న నీరు ఎప్పుడు లాగేస్తుంది, తాము ఎప్పుడు బయటపడతామని రైతులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 40వేల పై చిలుకు ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని ప్రాథమిక అంచనా. జిల్లాలో ముంపునకు గురైన వరి పంటతో పాటు ఉద్యానవన పంటల నష్టం అంచనాల కోసం క్షేత్రస్థాయిలో యంత్రాంగానికి కలెక్టర్ షణ్మోహన్ సగిలి బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. వరి పంటతో పాటు ఉద్యాన పంటలు కూడా ముంపునకు గురయ్యాయి. గొల్లప్రోలు, పిఠాపురం, తుని రూరల్ తదితర మండలాల్లో ఆరేడు వేల ఎకరాల్లో పత్తి, మిర్చి, కాయగూరలు తదితర ఉద్యానవన పంటలు వర్షంతో దెబ్బతిన్నాయి. మొత్తంగా జిల్లాఅంతటా కలిపి 10వేల పై బడే రైతుల పంటలు ముంపునకు గురయ్యాయంటున్నారు. కాజులూరు, సామర్లకోట, పెదపూడి, కరప, కిర్లంపూడి తదితర మండలాల్లో అత్యధికంగా పంట పొలాలు ముంపులో ఉన్నాయి. వరితో పాటు ఇతర వాణిజ్య పంటలకు 20 మండలాల్లో ముంపులో ఉన్నాయి. గొల్లప్రోలు, తొండంగి, తుని, శంఖవరం, రౌతులపూడి మండలాల్లో పత్తి పంట దెబ్బతింది. గొల్లప్రోలు మండలంలో వరితో పాటు దెబ్బతిన్న పత్తి పంటను పిఠాపురం వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎంపీ వంగా గీత పరిశీలించి రైతుల సాధక బాధలను తెలుసుకుని అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో పలు ఆయకట్టులో వెదజల్లు పద్ధతిలో సాగుచేసిన పొలాల్లో వరి పంట నేలకొరిగింది. సుమారు 10వేల ఎకరాల వరకు వర్షాలకు ముంపు బారిన పడ్డాయి. తుని నియోజకవర్గంలో సుమారు 1,200 ఎకరాల్లో వరి, మరో 1,000 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 1,245 ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో అరటి, 230 ఎకరాల్లో పత్తిపంట ముంపులో ఉంది. ఏలేరు, సుద్దగడ్డ కాలువలు పొంగి పొర్లుతుండడంతో గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో వరి పంటతో సహా ఇతర వాణిజ్య పంటలు కూడా వరద బారిన పడతాయనే ఆందోళన రైతుల్లో నెలకొంది.
ఉప్పాడలో
కూలిన గృహాలు
చి‘వరి’లో కష్టాల కన్నీళ్లు...
ఎంత కష్టం..ఎంత నష్టం
ముంపులో 40 వేల ఎకరాల వరి
7 వేల ఎకరాల్లో దెబ్బతిన్న
ఉద్యాన పంటలు
ఏపీఈపీడీసీఎల్‌కు రూ.1.12 కోట్ల నష్టం
‘తుపాను నిండా ముంచేసింది’
అప్పులు చేసి సాగు చేసిన వరి పంటను తుపాను అడియాశలు చేసింది. 14 ఎకరాలలో వరి సాగు చేశాను. 8 ఎకరాల్లో పంట నేలకు ఒరిగిపోయింది. ఇప్పటికే ఎకరాకు సుమారు రూ.36వేలు వరకు ఖర్చు చేశాను. వ్యవసాయశాఖ అధికారులు వరి చేలు పైకిలేపి కట్టలు కట్టండి అని చెబుతున్నారు.
– జానిక శివ, రైతు, తామరాడ, కిర్లంపూడి మండలం
మినుము నాశనమైపోయింది
ఆరు ఎకరాల మినుము పంట సాగు చేశాను. తుపానుకు పంట మొత్తం తడిసిపోయింది. గింజలు మొలకలు వస్తున్నాయి. సుమారు రూ.1,20,000 వరకు పెట్టుబడి పెట్టాను. పంట చేతికి రాకుండానే ఇలా అయింది. ఎకరం వరి సాగు చేశాను. వర్షాలు ఎక్కువైతే వరి పంటను కూడా నష్టం పోయే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి.
– దమ్ము అప్పారావు, కౌలు రైతు, పి.నాయకంపల్లి, గండేపల్లి మండలం
నిండా ముంచిన మోంథా
నిండా ముంచిన మోంథా


