ఎంపీ మా సమస్యలు వినలేదు
రోడ్డుపై బైఠాయించి మత్స్యకారుల నిరసన
కొత్తపల్లి: ఓట్లు వేయమని ఇంటివద్దకే వస్తారు. ఓటు వేసి నెగ్గిన తరువాత మా సమస్యలు చెప్పడానికి వస్తే వినకుండానే వెళ్లిపోతారా అంటూ నాయకర్ కాలనీ–1కి చెందిన మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పాడ తీర ప్రాంతంలో బుధవారం ఎంపీ ఉదయ శ్రీనివాస్ పర్యటించి తిరిగి వస్తుండగా నాయకర్ కాలనీ–1చెందిన మత్స్యకారులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఆయన కారు ఆపారు. అయితే ఎంపీ కారు ఆపకుండా వెళ్లిపోవడంతో మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తుపాను సమస్యలను తెలపడానికి కారు ఆపినా ఆపకుండా వెళ్లిపోవడమేమిటంటూ మండిపడ్డారు. రెండు రోజులుగా తుపాను కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలి పలు గృహాలు దెబ్బతిన్నాయని, విద్యుత్ లేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆయన దృష్టికి తీసుకువెళ్లేందుకు యత్నిస్తే ఎంపీ వినకుండా వెళ్లిపోయారని కంబాల పాండురంగ ఆవేదన వ్యక్తం చేశాడు. మాజీ ఎంపీ వంగా గీత వచ్చి మా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాకు ఽధైర్యం చెప్పి వెళ్లారు. అధికారంలో ఉన్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వచ్చారని తెలిసి మా సమస్యలు చెప్పుకునేందుకు రోడ్డుపైకి వచ్చామని కారు ఆపమని అడిగినా ఆపకుండా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వేట లేక పూట గడవని పరిస్ధితుల్లో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏలేరుకు వరద నీరు
తగ్గుముఖం
ఏలేశ్వరం: మోంథా తుపాను ప్రభావం అంతగా లేకపోవడంతో ఏలేరు రిజర్వాయర్‌కు వరద నీరు తగ్గుముఖం పట్టింది. పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో ప్రాజెక్టులోకి 2,392 క్యూసెక్కుల మేర నీటి నిల్వలు వచ్చి చేరాయి. బుధవారం నాటికి ప్రాజెక్టులో 86.56 మీటర్లకు 85.35 మీటర్లు, 24.11 టీఎంసీలకు గాను 21.66 టీఎంసీల మేర నీటినిల్వలు ఉన్నాయి. దిగువ ప్రాంతానికి 4,500, విశాఖకు 175 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నేడు తెరుచుకోనున్న
విద్యాసంస్థలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): తుపాను ప్రభావం తగ్గడంతో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు గురువారం నుంచి పనిచేయాలని డీఈఓ పిల్లి రమేష్ బుధవారం తెలిపారు. వీటితో పాటు, ఇంటర్మీడియెట్ కళాశాలలు, ఐటీఐలు, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలలు తెరచుకోనున్నాయి. తొలుత ఈ నెల 31 వరకూ సెలవులు ప్రకటించిన విషయం విదితమే.


