
ఆ నలుగురూ ఒక్కడై..
● కాకినాడ వాసి గొప్పదనం
● బహ్రెయిన్‌తో తెలుగు ప్రజల
మృతదేహాలకు అంత్యక్రియలు
కాకినాడ క్రైం: ఆఖరి మజిలీలో ఆ నలుగురూ తానే అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు మన కాకినాడ వాసి. స్వదేశానికి రాకుండా విదేశాల్లో ఉండిపోయిన తెలుగు ప్రజల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. ఎడారిలో అమృత బంధువుగా మారిన శివకుమార్ వివరాలు ఇవీ.. బతుకుతెరువు కోసం చాలా మంది తెలుగు ప్రజలు బహ్రెయిన్ దేశానికి ఉపాధి కోసం వెళుతుంటారు. ఏదైనా కారణాల వల్ల అక్కడ చనిపోతే, ఆ మృతదేహం స్వదేశానికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కారణంతో చాలా మృత దేహాలు అక్కడే ఫ్రీజర్లలో ఉండిపోతున్నాయి. ఈ విషయాన్ని ఆ దేశంలో స్థిరపడిన కాకినాడ వాసి దౌర్ల శివకుమార్ గమనించాడు. కూలి పనుల కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్న తెలుగు వారి కష్టాలను కళ్లారా చూశాడు. ఇరు దేశాల మధ్య మృతదేహాల తరలింపునకు చేసే ప్రక్రియల్లో వివిధ కారణాల వల్ల చోటు చేసుకుంటున్న జాప్యమే ఈ దుస్థితికి కారణమని తెలుసుకున్నాడు. దీంతో అక్కడి తెలుగు వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. మృతి చెందిన వారు తానకేమీ కాకున్నా అంతిమ వేళల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ మృతదేహం ఐదేళ్లుగా బహ్రెయిన్‌లోనే ఉండగా, అక్కడి అధికారులతో మాట్లాడి ఇటీవల మృతదేహాన్ని విడుదల చేయించాడు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించాడు.