
రామేశంపేట మెట్టలో అక్రమ మైనింగ్
● ఆగే వరకూపోరాటం చేస్తాం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు
విశ్వేశ్వరరావు
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): మైనింగ్ మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు. స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగవారం పెద్దాపురం మండలం రామేశం పేట మెట్టలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై విలేకర్ల సమావేశం నిర్వహించారు. రామేశంపేటలో అక్రమ మైనింగ్ జరుగుతోందని తనకు 60 ఫిర్యాదులు అందాయన్నారు. తాను స్వయంగా అక్కడ వెళ్లగా అనధికార మైనింగ్ జరుగుతోందన్నారు. దానిపై కలెక్టర్‌కు, మైనింగ్ శాఖ డీడీ నరసింహారెడ్డికి ఫిర్యాదు చేశానన్నారు. కానీ అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారన్నారు. ఇటీవల గ్రావెల్ వాహనం ఢీకొని కళాశాల విద్యార్థి మృతి చెందాడన్నారు. ప్రస్తుతం అక్రమ మైనింగ్ కారణంగా కొండలు రోజురోజుకీ తరిగిపోతున్నాయన్నారు. అధికారుల లెక్కల ప్రకారం 900 ఎకరాల్లో కేవలం 260 ఎకరాలకు మాత్రమే అనుమతి ఇచ్చారన్నారు. మిగిలినదంతా అనధికారికంగా జరుగుతోందన్నారు. రామేశంమెట్టలో అక్రమ మైనింగ్ ఆగే వరకూ బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు కుండల సాయి, మొసలగంటి సురేష్ , చోడిశెట్టి రమేష్‌బాబు పాల్గొన్నారు.