
‘సత్యదీక్ష’కు ప్రచారమేదీ..?
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని సత్య దీక్ష అంటే గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏటా ఈ దీక్షలను భక్తిశ్రద్ధలతో పాటించేవారు వందల్లో ఉంటారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో కూడా వందలాది మంది గిరిజనులు చేపడుతుంటారు. కార్తిక మాసానికి ముందు వచ్చే సత్యదేవుని జన్మనక్షత్రం ‘మఖ’ నాడు సత్య దీక్షలు ప్రారంభమవుతాయి. 27 రోజుల అనంతరం కార్తిక మాసంలో వచ్చే స్వామివారి జన్మనక్షత్రం రోజున ముగుస్తాయి. 27 రోజుల దీక్షలు చేయలేని వారి, మహిళల కోసం 18 రోజులు, తొమ్మిది రోజుల దీక్షలు కూడా ఉంటాయి. దీక్షల ముందు రోజు రాత్రి రత్నగిరిపై సత్యదేవుని పడిపూజ ఘనంగా నిర్వహిస్తారు. దీనిపై వివరంగా తెలియజేసేందుకు కనీసం నెల రోజుల ముందు నుంచి ప్రచారం చేసేవారు. ఈ ఏడాది 17వ తేదీ నుంచి దీక్షలు ప్రారంభం కానున్నా, ఇంత వరకూ ఎలాంటి ప్రచారం చేయకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రచార రథంతో జిల్లా అంతా సమాచారం చేరవేసేవారు. అదేవిధంగా గిరిజన భక్తులకు దీక్షా వస్త్రాలు, మాలలు ఉచితంగా అందజేసేవారు. ఇప్పుడూ అదే విధంగా చేస్తారా.. లేదా అనే దానిపై స్పష్టత లేదు.
ఇవీ నియమాలు : పసుపు వస్త్రాలు ధరించి సత్యదేవుని ఆలయం లేదా, మరే ఇతర ఆలయంలోనైనా అర్చకుడు లేదా గురుస్వామి లేదా తల్లి చేతుల మీదుగా తులసి మాల ధరించి సత్యదీక్ష చేపట్టవచ్చు. ఈ నియమాలన్నీ స్వామి అయ్యప్ప నియమాలలా ఉంటాయి. ప్రాతః కాలానికి ముందు నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని సత్యదేవుని పూజ చేయడం, అదే విధంగా సూర్యాస్తమయం తరువాత స్వామివారికి పూజ చేయడం ప్రధానాంశాలు. స్వాములు ఒక పూట భోజనం, రాత్రి వేళ ఫలహారం, నేలపై నిద్ర, బ్రహ్మచర్యం పాటించడం, మాంసాహారం, ఉల్లిపాయ వంటివి తీసుకోకుండా ఉండడం చేయాలి. ఎవరినీ పరుషంగా మాట్లాడరాదు. స్వాములందరినీ సత్యదేవుని స్వరూపంగా భావించి గౌరవించాలి.
మరో వారమే గడువు : సత్యదీక్షల ప్రారంభానికి మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికై నా దేవస్థానం అధికారులు స్పందించి దీని గురించి ప్రచారం చేయాలని భక్తులు కోరుతున్నారు. అదే విధంగా ఏజెన్సీ గిరిజన భక్తులకు సత్యదీక్ష వస్త్రాలు, మాలలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫ రత్నగిరిపై 17 నుంచి ప్రారంభం
ఫ ఇంకా వివరాలు ప్రకటించని
అధికారులు