సెజ్‌ రైతులపై కక్ష! | - | Sakshi
Sakshi News home page

సెజ్‌ రైతులపై కక్ష!

Oct 7 2025 3:33 AM | Updated on Oct 7 2025 3:33 AM

సెజ్‌

సెజ్‌ రైతులపై కక్ష!

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ప్రతిపక్షంలో ఉండగా కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) లోని రైతుల భూములు తిరిగి వారికే రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చేస్తామని చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ రైతులపై కక్ష కట్టినట్టు ఆ అంశాన్ని గాలికొదిలేశారు. తద్వారా కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల పరిధిలో సుమారు 300 మంది రైతుల జీవితాలతో సర్కారు ఆటలాడుకుంటోంది.

గత చంద్రబాబు పాలనలోనే భూసేకరణ

కాకినాడ సెజ్‌ కోసం తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల పరిధిలో గత చంద్రబాబు సర్కార్‌ అవసరం లేకున్నా అడ్డగోలుగా 8,401 ఎకరాలు సేకరించింది. ఇందులో 2,180 ఎకరాల భూ సేకరణను అప్పట్లో రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ భూముల స్వాధీనానికి అప్పట్లో చంద్రబాబు సర్కారు వందలాది మంది రైతులు, ఉద్యమ నేతలపై ఉక్కుపాదం మోపింది. అయినప్పటికీ పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది.

గతంలో వెనక్కిచ్చిన జగన్‌ ప్రభుత్వం

అటువంటి తరుణంలో ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సెజ్‌ ప్రాంతానికి వచ్చిన నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవసరం లేని భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకని నిర్దేశించిన కాకినాడ సెజ్‌లో అవసరం లేని భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని గత జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు 2021 మార్చి 4న జీఓఎంఎస్‌ నంబర్‌ 12/21 ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాకుండా రైతులకు ఆ భూములను ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని కూడా నిర్ణయింది. ఆ మేరకు 2021 జూలై 6న జీఓఎంఎస్‌ నంబర్‌ 158ని అనుసరించి స్టాంప్‌ డ్యూటీ మినహాయించి ఉచిత రిజిస్ట్రేషన్లతో రైతులకు మేలు చేసింది. రైతులకు తిరిగి ఇచ్చేసే భూములకు రిజిస్ట్రేషన్‌ చేసే ప్రక్రియ గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే ప్రారంభమైంది. నాడు గ్రామ సచివాలయాల్లో సైతం ఉచిత రిజిస్ట్రేషన్లు చేయించారు.

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయక...

గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఉచిత రిజిస్ట్రేషన్లకు అవసరమైన మార్పులను సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో చేయకుండా జాప్యం చేస్తోంది. తద్వారా సాంకేతిక ప్రతిబంధకాన్ని సాకుగా చూపిస్తూ, ఉచిత రిజిస్ట్రేషన్లకు బ్రేకులు వేసింది. ఇది సుమారు 300 మంది సెజ్‌ రైతులకు శాపంగా మారింది. గత జగన్‌ ప్రభుత్వం భూ మార్పిడి కింద రైతుల నుంచి 785 ఎకరాలు తీసుకుని, వారి సొంత మండలాల్లో గ్రామాలకు ఆనుకుని భూములు తిరిగి ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. సెజ్‌ కోసం చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా సేకరించిన భూముల్లో 526 ఎకరాలను జగన్‌ ప్రభుత్వం రైతులకు తిరిగి ఇవ్వడమే కాకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్లు కూడా చేయించింది. అనంతరం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రైతులకు 259 ఎకరాలు రీ రిజిస్ట్రేషన్లు జరగకుండా పెండింగ్‌లో పడిపోయాయి. అలాగే, ఎవరి భూమి వారికి వదిలేసిన దానిలో 1,395 ఎకరాలున్నాయి. ఇందులో 465 ఎకరాలు రైతుల పేరున రిజిస్ట్రేషన్‌ చేయించి ఇచ్చేశారు. మిగిలిన 930 ఎకరాలు రిజిస్ట్రేషన్‌కు నోచుకోక రైతులు గగ్గోలు పెడుతున్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత ఏడాది అక్టోబరు 30న జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి రిజిస్ట్రేషన్‌ శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కు లేఖ కూడా రాశారు. అయినప్పటికీ కూటమి సర్కారు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయకుండా గాలికొదిలేసింది.

పిల్లలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి

భూములున్నా రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో పిల్లలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఎంతోమంది రైతులు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో తిరిగి ఇచ్చిన భూములకు కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. తక్షణమే రిజిస్ట్రేషన్లు యథావిధిగా నిర్వహించాలి.

– చింతా సూర్యనారాయణమూర్తి,

రైతు, మూలపేట, కొత్తపల్లి మండలం

రిజిస్ట్రేషన్లు చేయాలి

గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మినహాయింపు ప్రకటించిన సెజ్‌ భూములకు వెంటనే రిజిస్ట్రేషన్లు చేయాలి. అలా చేయకపోవడంతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. నాకు ఏడెకరాలకు రిజిస్ట్రేషన్‌ చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మినహాయింపు భూములకు రిజిస్ట్రేషన్‌ నిలిపియడం చాలా దారుణం.

– బొమ్మిడి గోవిందు,

రావివారిపోడు, కొత్తపల్లి మండలం

గతంలో భూములు తిరిగిచ్చిన

జగన్‌ ప్రభుత్వం

నాడు ఉచిత రిజిస్ట్రేషన్లతో మేలు

నేడు సాఫ్ట్‌వేర్‌ ప్రతిబంధకాలతో జాప్యం

కలెక్టర్‌ లేఖ రాసినా

స్పందించని రిజిస్ట్రేషన్ల శాఖ

1,189 ఎకరాలకు నిలిచిన రిజిస్ట్రేషన్లు

300 మందికి ఇబ్బందులు

కూటమి సర్కారు తీరుపై ఆగ్రహం

నష్టపోతున్న రైతులు

తమ భూములను తిరిగి ఇచ్చే ఉద్దేశం లేనందువల్లనే కూటమి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందనే విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో సెజ్‌ రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. భూములు తమవని చెప్పుకోవడానికే తప్ప అధికారికంగా ఎందుకు పనికిరాకుండా ఉన్నాయని మండిపడుతున్నారు. ఈ భూముల టైటిల్‌ డీడ్స్‌ అన్నీ కాకినాడ సెజ్‌ పేరిట ఉన్నాయి. అదే రైతులకు పెద్ద గుదిబండగా మారింది. ఈ కారణంగా వీటిని కనీసం బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలన్నా.. పిల్లలకు కట్నకానుకలుగా ముట్టజెప్పాలన్నా రైతులకు అవకాశం ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించడానికి ముందుకు రాకుంటే డబ్బులు పెట్టి చేయించుకోవాలని అనుకున్నా సెజ్‌ భూములు కమర్షియల్‌లో ఉన్నాయి. ఈ కారణంగా వీటి విలువ పెరిగిపోయి రిజిస్ట్రేషన్‌ చార్జీలు రెండు మూడింతలు పెరిగిపోయి, రైతులకు తలకు మించిన భారమవుతోంది. వారసత్వంగా తాతముత్తాల దగ్గర నుంచి వస్తున్న ఈ భూములను నాడు జగన్‌ సర్కార్‌ తిరిగి ఇచ్చేస్తామని చెప్పడమే కాకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్‌ కూడా చేయించగా.. అంతటి మానవతా దృక్పథం చంద్రబాబు సర్కారుకు లేకుండా పోయిందని రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా సెజ్‌ భూముల్లో ఏరువాక సాగి, రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తానన్న చంద్రబాబు.. తీరా గద్దెనెక్కాక ఆ విషయం పట్టించుకోకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

సెజ్‌ రైతులపై కక్ష!1
1/2

సెజ్‌ రైతులపై కక్ష!

సెజ్‌ రైతులపై కక్ష!2
2/2

సెజ్‌ రైతులపై కక్ష!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement