
నేడు జెడ్పీ సమావేశం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నట్లు సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి జెడ్పీ పరిధిలోని కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులు పాల్గొనాలని సీఈఓ కోరారు.
పీజీఆర్‌ఎస్‌కు 418 అర్జీలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 418 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డుల్లో పేర్ల మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, ఆన్‌లైన్‌లో భూమి వివరాల నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడికల తొలగింపు, పారిశుధ్యం తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు.
పంచారామ క్షేత్రంలో
22 నుంచి కార్తిక మాసోత్సవాలు
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత కుమారా రామభీమేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకూ కార్తిక మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6 గంటకు ఆకాశదీపంతో కార్తిక మాసోత్సవాలు ప్రారంభిస్తామన్నారు. స్వామివారి కార్త్తిక మాస దర్శనాలు 22 నుంచి ఉంటాయన్నారు. నాలుగు ఆది, నాలుగు సోమవారాల్లో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. నవంబర్ 5న కార్తిక పౌర్ణమి, 6న కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకొని గ్రామోత్సవం ఉంటాయని తెలిపారు. స్వామివారు ఆలయానికి తిరిగి వచ్చిన తరువాత రాత్రి జ్వాలాతోరణం నిర్వహిస్తామన్నారు. నవంబర్ 18న మాసశివరాత్రి, 20న అమావాస్య సందర్భంగా కోటి దీపోత్సవం, 21న పోలి పాడ్యమిని పురస్కరించుకొని స్వామివారికి జటాజూటాలంకరణతో ఉత్సవాలు ముగుస్తాయని ఈఓ వివరించారు. కార్తిక సోమవారాల్లో తెల్లవారుజామున 4 నుంచి మధ్యాహ్నం 2.30 వరకూ, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకూ స్వామివారి దర్శనాలు ఉంటాయని తెలిపారు. మిగిలిన రోజుల్లో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ, సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకూ దర్శనాలు ఉంటాయని నీలకంఠం వివరించారు.
వాడపల్లిలో బ్రహ్మోత్సవాల
ఏర్పాట్లపై సమీక్ష
సాక్షి, అమలాపురం: ఆత్రేయపురం మండలంలో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల పదో తేదీ నుంచి 18వ తేదీ వరకూ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ మహేష్‌కుమార్ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ నెల 11, 18వ తేదీల్లో భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉందని, పార్కింగ్, బందోబస్తు ఏర్పాట్లు, రేవుల వద్ద భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 10న శేష వాహన సేవ, 11న హంస వాహన సేవ, 12న హనుమద్వాహన సేవ, 13న సింహ వాహన సేవ, 14న గరుడ వాహన సేవ, 15న ఉదయం సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ, 16న రాజాధిరాజ అలంకరణతో గజవాహన సేవ, 17న ఉదయం కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం అశ్వవాహన సేవ, 18న చివరి రోజు చక్రస్నానం కార్యక్రమాలను జరుగుతాయని వివరించారు. కళావేదిక వరకు బస్సులు నడపాలని, క్యూలు, దర్శన ఏర్పాట్లపై పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ రాహుల్ మీనా, దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, డీఎస్పీ మురళీమోహన్, ఆర్డీవో పి.శ్రీకర్, తహసీల్దార్ రాజేశ్వరరావు పాల్గొన్నారు.