
స్వచ్ఛమైన తాగునీరు అందించాలి
సామర్లకోట: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గ్రామీణ నీటిపారుదల విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) చీఫ్ ఇంజినీర్ ఇషాన్ బాషా అన్నారు. జల్‌జీవన్ మిషన్‌పై 11 జిల్లాల్లోని 402 మంది ఏఈఈలు, డిప్యూటీ ఎంపీడీఓలకు సామర్లకోటలోని విస్తరణ శిక్షణ కేంద్రం(ఈటీసీ)లో మూడు రోజుల శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించారు. మొదటి బ్యాచ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని 40 మంది ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రమాణాలు పాటించని ఆర్‌ఓ కేంద్రాల నీటి వాడకం బాగా పెరిగిపోయిందని, దీని వలన ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు మాట్లాడుతూ, తరచూ తాగునీటి నాణ్యతను పరీక్షించాలని సూచించారు. ఈటీసీ ప్రిన్సిపాల్ కేఎన్‌వీ ప్రసాదరావు మాట్లాడుతూ, తాగునీటి పథకాల నిర్వాహకులు సమన్వయంతో పని చేయాలన్నారు. శిక్షణ పొందే అధికారుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి యూనిట్‌ను పరిశీలించాలని సూచించారు. ప్రతి బ్యాచ్‌కు మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. కాకినాడ ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అబ్దుల్ మదీన్, విశ్రాంత ఎస్‌ఈ ఉమాశంకర్, పెద్దాపురం డీఈఈలు స్వామి, శ్రీరామ్, ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ డి.శ్రీనివాసరావు తొలి రోజు శిక్షణ ఇచ్చారు.
రేపటి నుంచి ఆధార్ క్యాంపులు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా ఈ నెల 8 నుంచి ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కాకినాడ పోస్టల్ సూపరింటెండెంట్ కె.కృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో తేదిన పిఠాపురం భాష్యం హైస్కూల్, నీలపల్లి ఉన్నత పాఠశాల; 10, 11 తేదీల్లో ఏలేశ్వరం ఎంపీపీ స్కూల్, గాడిమొగ ఉన్నత పాఠశాల; 13, 14 తేదీల్లో పెద్దాపురం లూథరన్ ఉన్నత పాఠశాల, డి.పోలవరం ఉన్నత పాఠశాలల్లో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఐదు నుంచి ఏడేళ్లు, 15 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు.
స్వచ్ఛాంధ్ర ఉద్యమం
నిరంతరం కొనసాగించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవం స్థానిక గోదావరి కళాక్షేత్రం ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో 2, జిల్లా స్థాయిలో 15 కేటగిరీల్లో మన జిల్లా 50 అవార్డులు అందుకుందంటూ హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు సాధించిన వివిధ సంస్థల ప్రతినిధులను, అధికారులను అభినందించి, అవార్డులు అందించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ భావన, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛమైన తాగునీరు అందించాలి