
పత్తి రైతులను ఆదుకోవాలి
● తక్షణం నష్టం అంచనా వేయాలి
● నష్టపరిహారం ఇవ్వాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిన్న మొన్నటి వరకూ యూరియా కొరత సృష్టించి రైతులతో ఆటలాడుకున్న కూటమి సర్కారు.. ఇప్పుడు పత్తి రైతులను కష్టాల్లోకి నెట్టేసిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. జిల్లాలోని మెట్ట ప్రాంత మండలాల్లో రైతులు గంపెడాశలతో పత్తి సాగు చేశారన్నారు. పంట చేతికొచ్చే సమయంలో అకస్మాత్తుగా మొక్కలు చనిపోతున్నా రైతుల గోడు సర్కారు చెవికెక్కడం లేదన్నారు. నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్లాటినం రకం విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతూ తీవ్రంగా మోసపోయి గగ్గోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని కోటనందూరు, తుని, తొండంగి, గోకవరం, కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం, పెద్దాపురం తదితర మెట్ట ప్రాంత మండలాల్లో సుమారు 35 వేల హెక్టార్లలో రైతులు పత్తి సాగు చేశారన్నారు. గతంలో మూడు విడతలుగా దిగుబడి తీసేవారన్నారు. అటువంటిది రానురానూ రెండు విడతలకే పరిమితమైందన్నారు. నాలుగైదు నెలలుగా కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్న పత్తి పంట చేతికొచ్చే సమయానికి ఇంత దారుణంగా దెబ్బతిని నష్టపోతామనుకోలేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, ఎకరాకు రూ.40 వేల ఆదాయం వస్తుందనే అంచనాతో ఉన్న రైతులకు ఈ పరిణామం అశనిపాతమేనని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మొదట వ్యవసాయ రంగమే నష్టపోతుందని చెప్పారు. ఎప్పుడూ ఎరువులు దండిగా లభించేవని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత యూరియా కోసం రైతులు నానా పాట్లూ పడ్డారని గుర్తు చేశారు. ఇప్పుడు పిఠాపురం తదితర నియోజకవర్గాల్లో నకిలీ పత్తి విత్తనాల సరఫరా సర్కారుకు రివాజుగా వస్తోందని ఆరోపించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని, సరైన విజిలెన్స్ లేకపోవడమే దీనికి కారణమని అన్నారు. జిల్లాలో రైతులు ఎక్కడెక్కడ పత్తి సాగు చేశారు, ఎంత మంది రైతులు, ఎన్ని ఎకరాల్లో నష్టపోయారో అధికారులు లెక్కలు రూపొందించాలని రాజా డిమాండ్ చేశారు.