
పత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు
విత్తనాలు, మొక్కల శాంపిల్స్ సేకరణ
పిఠాపురం: గొల్లప్రోలు మండలం చేబ్రోలు తదితర గ్రామాల్లో నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయామంటూ రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అధికారులు సోమవారం పత్తి పంటను పరిశీలించారు. ‘రైతుకు విపత్తి’ శీర్షికన ‘సాక్షి’ సోమవారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. గుంటూరు లాం ఫామ్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్.రాజామణి (ప్రిన్సిపల్ సైంటిస్ట్, పత్తి), డాక్టర్ వీవీ మనోజ్ కుమార్ (ప్రిన్సిపల్ సైంటిస్ట్, తెగుళ్ల విభాగం), డాక్టర్ రాజేష్ చౌదరి (సైంటిస్ట్, కీటక శాస్త్రం), సీతారామశర్మ (పెద్దాపురం ఏరువాక కేంద్రం), జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయకుమార్, పిఠాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు పి.స్వాతి కలసి చేబ్రోలు, చెందుర్తి, తాటిపర్తి గ్రామాల్లో పర్యటించి పత్తి చేలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిజేరియం విల్ట్, ఆకుమచ్చ తెగులు, టొబాకో స్ట్రీక్ వైరస్ ఆశించడం వలన పత్తి మొక్కలు చనిపోతాయని చెప్పారు. జరిగిన నష్టంపై కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామని, మొక్కల శాంపిల్స్‌ను పరీక్షించేందుకు తీసుకు వెళ్తున్నామని తెలిపారు. రైతుల నుంచి విత్తనాలు సేకరించి, వాటిని కూడా పరీక్షకు తీసుకు వెళ్తామని, రెండు రోజుల్లో నివేదిక పంపిస్తామని చెప్పారు. శాస్త్రవేత్తల వెంట అధిక సంఖ్యలో రైతులు, మండల వ్యవసాయ అధికారి కేవీ సత్యనారాయణ, గ్రామ వ్యవసాయ సహాయకులు రాజా, ఉదయ్, రెడ్డి తదితరులున్నారు. అధికారులు శాసీ్త్రయంగా నిర్ధారించకుండా కేవలం తెగుళ్ల వంక చూపించి, విత్తన కంపెనీలకు కొమ్ము కాస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఈ సందర్భంగా రైతులు హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కేవలం విత్తనాల్లో నాణ్యత లేనందువల్లనే ఇంత నష్టం జరిగిందని, పూర్తి స్థాయిలో విత్తనాలను పరిశీలించి, అసలు నిజాన్ని బయటపెట్టి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

పత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు