
నేటి నుంచి వనదుర్గ అమ్మవారి జాతర
అన్నవరం: రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారి శ్రావణమాస జాతర సోమవారం ప్రారంభం కానుంది. ఈ నెల 9న శ్రావణ పౌర్ణమి వరకూ ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తొలి రోజున అమ్మవారిని బాలాత్రిపురసుందరిగా అలంకరించి, పండితులు పూజలు చేస్తారు. పౌర్ణమి వరకూ రోజుకో అలంకారం చేస్తారని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు వనదుర్గ అమ్మవారి ఆలయంలో పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనంతో ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. నవధాన్యాలతో మండపారాధన, కలశ స్థాపన చేస్తారు. 50 మంది రుత్విక్కులు నవగ్రహ జపాలు, శ్రీచక్రార్చన, పురుష, శ్రీసూక్త పారాయణలు, మూలమంత్ర జపాలు, సూర్య నమస్కారాలు, సప్తశతీ పారాయణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. చండీ హోమానికి పండితులు అంకురార్పణ చేస్తారు. ఆ రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. తొమ్మిదో తేదీన శ్రావణ పౌర్ణమి నాడు వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం నిర్వహిస్తారు. దీంతో శ్రావణ మాస పూజలు ముగుస్తాయి.
రత్నగిరి కిటకిట
● సత్యదేవుని దర్శించిన
40 వేల మంది భక్తులు
● 2,500 వ్రతాల నిర్వహణ
● రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం కిటకిటలాడింది. రత్నగిరి పైన, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోను శనివారం రాత్రి, ఆదివారం వేకువజాము ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. దీంతో, అధిక సంఖ్యలో నవదంపతులు సత్యదేవుని వ్రతాలాచరించి, స్వామివారిని దర్శించారు. వారికి వారి బంధుమిత్రులు, ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారిపోయింది. సత్యదేవుని వ్రతాలు 2,500 నిర్వహించారు. స్వామివారిని దర్శించిన భక్తులు శ్రీగోకులంలో సప్త గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించారు. అనంతరం రావిచెట్టుకు ప్రదక్షిణ చేసి, జ్యోతులు వెలిగించారు. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఘనంగా ఊరేగించారు.
లోవలో భక్తుల సందడి
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి ఆదివారం ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు దేవదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,05,890, పూజా టికెట్లకు రూ.1,71,160, కేశఖండన శాలకు రూ.18,760, వాహన పూజలకు రూ.9,240, పొంగలి షెడ్లు, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.77,426, విరాళాలు రూ.58,967, కలిపి మొత్తం రూ.5,41,443 ఆదాయం సమకూరిందని వివరించారు.

నేటి నుంచి వనదుర్గ అమ్మవారి జాతర

నేటి నుంచి వనదుర్గ అమ్మవారి జాతర