
కక్ష సాధింపు మానాలి
కాకినాడ రూరల్: కక్ష సాధింపులు మానుకుని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు. గైగోలుపాడులోని తన నివాసంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మద్యం విధానంపై పెట్టిన కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును సీఐడీ నుంచి సిట్‌కు అప్పజెప్పడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. మద్యం అమ్మకాలు పెరిగినప్పుడు అవినీతి జరుగుతుందా, తగ్గినప్పుడు జరుగుతుందా గమనించాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కక్ష సాధింపులో భాగంగానే ఆయన అనుచరులను వేధిస్తున్నారన్నారని పేర్కొన్నారు. గతంలో ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, బీపీ ఆచారిలను ఇదే మాదిరిగా వేధించారని, వారు ఆ కేసుల నుంచి క్లీన్‌చిట్‌తో బయటకు వచ్చారని అన్నారు. అటవీ భూములు ఆక్రమించారంటూ పెద్దిరెడ్డి కుటుంబంపై కేసులు బనాయిస్తున్నారన్నారు. భోగాపురంలో నిర్మించిన రిసార్ట్‌లో 51 ఎకరాల అటవీ భూమి ఉందనే ఆరోపణలను నిగ్గు తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులపై, గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులపై అక్రమ కేసులు బనాయించడం మానుకోవాలని నాగమణి హితవు పలికారు.
ప్రశాంతంగా
ఏపీ ఈఏపీ సెట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చరల్ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీ సెట్–2025 ఆన్‌లైన్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్ష నిర్వహించారు. కాకినాడ ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల, రాయుడుపాలెం సాఫ్ట్ టెక్నాలజీ, సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం కలిపి 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆయా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు. జిల్లాలో అక్కడక్కడ ప్రారంభ సమయంలో కొద్ది నిమిషాల పాటు సర్వర్ సమస్య మినహా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా పరీక్షలు సజావుగా సాగాయి. జిల్లాలో ఉదయం పరీక్షకు 922 మంది దరఖాస్తు చేసుకోగా 844 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 923 మంది దరఖాస్తు చేసుకోగా 869 మంది హాజరయ్యారు. ఉదయం, సాయంత్రం కలిపి 92.85 శాతం హాజరు నమోదైంది.

కక్ష సాధింపు మానాలి