
‘కోట’ మున్సిపల్ చైర్‌పర్సన్ రాజీనామా
సామర్లకోట: మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఆపై వైఎస్సార్ సీపీ సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కౌన్సిల్ సమావేశం అవుతున్న రెండు గంటల ముందు అరుణ రాజీనామా చేశారు. అందుకు దారితీసిన పరిస్థితులు ఇలా ఉన్నాయి. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 31 వార్డులు ఉన్న పట్టణంలో వైఎస్సార్ సీపీ 29 వార్డులను కై వసం చేసుకుంది. చైర్‌పర్సన్ పదవి పార్టీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు తల్లి పార్వతికి ఇవ్వాలని ముందుగా నిర్ణయించారు. అయితే పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో ఒకే పదవి ఉండాలని నిర్ణయించడంతో 27వ వార్డు నుంచి ఎన్నిక అయిన గంగిరెడ్డి అరుణకు ఉహించని పరిస్థితిలో చైర్‌పర్సన్ పదవి లభించింది. 26వ వార్డు కౌన్సిలర్ నక్కా లలిత అనారోగ్యంతో మృతి చెందారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఇద్దరు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరారు. దాంతో టీడీపీ బలం నాలుగుకు చేరింది. చైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణ గత కొంతకాలంగా పార్టీ సభ్యుల వార్డులలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేదని, అజెండాలో అంశాలు సభ్యులకు తెలియపర్చడం లేదని మెజార్టీ సభ్యులు అసంతృప్తితో ఉన్నారు. దాంతో ఆమైపె ఆవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా గత నెల 2వ తేదీన బలనిరూపణ కోసం 22 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి కలెక్టరు షణ్మోహన్, మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్యలకు వినతి పత్రాలు అందజేశారు. మూడవ తేదీన చైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఫిర్యాదులు రావడంతో ఆమెను గత నెల మూడవ తేదీన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాగా గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బలనిరూపణకు కలెక్టరు అవకాశం ఇచ్చారు. ఈ ప్రత్యేక సమావేశానికి కాకినాడ ఆర్డీఓ మల్లిబాబును ప్రత్యేకాధికారిగా నియమించారు. దాంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అందరూ ఎదురుచూస్తూ ఉండగా ప్రత్యేక సమావేశానికి రెండు గంటల ముందుగా ఉదయం 9 గంటలకు చైర్‌పర్సన్ అరుణ కమిషనర్ ఎ.శ్రీవిద్యను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. దాంతో గత నెల రోజులుగా పట్టణంలో నెల కొన్న ఉత్కంఠకు తెరపడింది. అనంతరం 11 గంటలకు ఆర్డీఓ మల్లిబాబు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశానికి 25 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు హాజరై చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కాగా డీఎస్పీ డి.శ్రీహరిరాజు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నెల రోజుల ఉత్కంఠకు తెర
మున్సిపల్ కార్యాలయం వద్ద
భారీ పోలీసు బందోబస్తు