
ఘనంగా సత్యదేవుని చక్రస్నానం
● వేడుకగా నాగవల్లీ పట్టు,
దండియాడింపు కార్యక్రమాలు
● రత్నగిరిపై నేడు శ్రీపుష్పయాగం
అన్నవరం: వార్షిక దివ్యకల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం పంపా జలాల్లో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు చక్రస్నానం, సాయంత్రం రత్నగిరిపై నాగవల్లి, దండియాడింపు కార్యక్రమాలను పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెళ్లి పెద్దలు సీతారాములు వెంట రాగా నవ దంపతులు సత్యదేవుడు, అమ్మవార్లను ఉదయం 8.30 గంటలకు ఊరేగింపుగా పంపా నదీ తీరానికి తీసుకువచ్చారు. అక్కడి మండపం లోపల సింహాసనంపై స్వామి, అమ్మవార్లను, మరో ఆసనం మీద సీతారాములను వేంచేయించి, పూజలు చేశారు. పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి, శూలానికి పంచామృతాలతో అవభృథ స్నానం చేయించారు. అనంతరం బలిమూర్తికి, సుదర్శన చక్రాన్ని ఊరేగింపుగా పంపా నది లోపలకు తీసుకువెళ్లి నదిలో మూడుసార్లు చక్రస్నానం చేయించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, చిట్టి శివ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకులు దత్తు శర్మ, సుధీర్, పవన్, దేవస్థానం వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, వైదిక కమిటీ సభ్యుడు, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్ తదితరులు ఈ కార్యక్రమం నిర్వహించారు.
రత్నగిరిపై అనివేటి మండపంలో స్వామి, అమ్మవార్లకు సాయంత్రం నాగవల్లి పట్టు, నీలలోహిత ధారణ, దండియాడింపు కార్యక్రమాలను పండితులు ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్లను ప్రత్యేక వేదిక మీద, పెళ్లిపెద్దలు సీతారాములను మరో ఆసనం మీద ఆశీనులను చేసి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగులతో నాగవల్లి తీర్చిదిద్ది పూజలు చేశారు. అమ్మవారికి నీలలోహిత ధారణ చేశారు. ధ్వజావరోహణ చేసిన తరువాత అర్చకులు కంకణ విమోచనం చేశారు. అనంతరం వధూవరులైన అమ్మవారు, సత్యదేవుని తరఫున అర్చకులు బంతులాట, బిందెలో ఉంగరం వెతకడం వంటి వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకులు కొండవీటి రాజా, పవన్, యడవిల్లి ప్రసాద్ తదితరులు స్వామి, అమ్మవార్ల విగ్రహాలు పట్టుకుని నృత్యం చేస్తూ, ఒకరిపై ఒకరు రంగులు జల్లుకున్నారు. ప్రధానాలయంలో సత్యదేవుడు, అమ్మవార్లకు, రామాలయంలో సీతారాముల విగ్రహాలపై కూడా రంగులు జల్లారు. సిబ్బంది కూడా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని వేడుక చేశారు.
నేడు కల్యాణోత్సవాల ముగింపు
సత్యదేవుడు, అమ్మవార్ల శ్రీపుష్పయాగం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు, మహిళలకు జాకెట్టు ముక్కలు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా నిత్య కల్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఈ వేడుకతో సత్యదేవుని దివ్యకల్యాణోత్సవాలు ముగియనున్నాయి.
అన్నవరంలో నేడు
తెల్లవారుజామున 3.00 : సుప్రభాత సేవ
ఉదయం 8.00 : చతుర్వేద పారాయణ
రాత్రి 7.30 : రత్నగిరిపై స్వామివారి నిత్యకల్యాణ మండపంలో సత్యదేవుని శ్రీపుష్పయాగ మహోత్సవం
ఉదయం 7.00 – 10.00, సాయంత్రం 5.00 – రాత్రి 11.00 : సాంస్కృతిక కార్యక్రమాలు

ఘనంగా సత్యదేవుని చక్రస్నానం