● ప్రతి నియోజకవర్గంలో
2 వేల కిలో వాట్ల ఉత్పత్తి లక్ష్యం
● మంత్రి నారాయణ
కాకినాడ సిటీ: పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 10 వేల ఇళ్లపై 2 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. కాకినాడలో శుక్రవారం నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ వివరించిన అంశాలు, వాటిపై ముఖ్యమంత్రి చేసిన సూచనలు, ఆదేశాల అమలుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్షించారు. పీఎం సూర్యఘర్ పథకానికి జిల్లాలో ఇప్పటి వరకూ 5,086 దరఖాస్తులు అందగా 3,230 కిలోవాట్ల సామర్థ్యం మేరకు 890 యూనిట్లు నెలకొల్పారని వివరించారు. మిగిలిన లక్ష్య సాధనకు ఎనర్జీ అసిస్టెంట్లతో విస్తృతంగా అవగాహన కల్పించి, దరఖాస్తులను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయించాలని సూచించారు. ఇళ్లపై సోలార్ ప్యానళ్లు పెట్టేందుకు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో ఎస్సీ లబ్ధిదారుల యూనిట్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను వారికి ఉచితంగా అందించాలని, ఇందుకు అనువైన భూములను గుర్తించాలని ఆదేశించారు. వేసవిలో వడగాడ్పులు, తాగునీటి ఎద్దడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాలని సూచించారు. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామీణ ఆవాసాల్లో 463, పట్టణ ఆవాసాల్లో 17 చలివేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.12.82 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.72 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద గ్రామాల్లో 1,484 వ్యక్తిత మరుగుదొడ్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకూ 420 నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. 134 కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం పూర్తయ్యి, మరో 49 నిర్మాణంలో ఉన్నాయన్నారు. పట్టణాల్లోని కమ్యూనిటీ మరుగుదొడ్లకు రూ.80 లక్షలతో మరమ్మతులు చేయిస్తున్నామని తెలిపారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేసేందుకు జిల్లాలో 30 మందికి పైలట్ శిక్షణ ఇచ్చామన్నారు. 3.50 లక్షల పశువులకు అవసరమైన 25 లక్షల టన్నుల పశుగ్రాసం ఉత్పాదనకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.