ఈ స్పందన ‘సాక్షి’గా..

- - Sakshi

సత్యదేవుని సన్నిధిలో సమస్యలపై

13న ‘సాక్షి’ కథనం

వెంటనే స్పందించిన ఇన్‌చార్జి ఈఓ

వారంలోగా పరిష్కరించాలని ఆదేశం

సిబ్బంది ఉరుకులు, పరుగులు

రెండు నెలలుగా మూలన పడిన

బ్యాటరీ కార్లకు తక్షణ మరమ్మతులు

భక్తులకు చల్లని మజ్జిగ, మంచినీటి సరఫరాకు ఏర్పాట్లు

రవాణాకు సిద్ధమవుతున్న

దేవస్థానం బస్సులు

అన్నవరం: వారం రోజుల క్రితం ‘సాక్షి’ ప్రచురించిన కథనం అధికారులు, సిబ్బందిలో కదలిక తేవడంతో సత్యదేవుని భక్తుల సమస్యలు పరిష్కారమయ్యాయి. ‘సత్యదేవుని భక్తులకు సూర్యప్రతాపం’ శీర్షికన రత్నగిరికి వస్తున్న భక్తుల సమస్యలపై ‘సాక్షి’ ఈ నెల 13న కథనం ప్రచురించింది. ఎండ నుంచి రక్షణ లేక, క్యూల్లో మంచినీరు అందించక, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విరాళంగా ఇచ్చిన రెండు బ్యాటరీ కార్లూ రెండు నెలలుగా మూలన పడి ఉన్న అంశాలను ఆ కథనం వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై అప్పట్లోనే ఇన్‌చార్జి ఈఓ చంద్రశేఖర్‌ అజాద్‌ వెంటనే స్పందించారు. ‘సాక్షి’ ప్రస్తావించిన సమస్యలను ‘నాడు – నేడు’ మాదిరిగా వారం రోజుల్లోగా పరిష్కరించాలని మూడు విభాగాల అధికారులను ఆదేశించారు. దీంతో దేవస్థానం అధికారులు ఉరుకులు పరుగులతో పనులు చేపట్టారు. గడువు లోగా సమస్యలు పరిష్కరించారు.

పరిష్కారమయ్యాయిలా..

● శని, ఆదివారాల్లో భక్తులకు చల్లని మజ్జిగ అందించారు. ఇందుకోసం పశ్చిమ రాజగోపురం వద్ద, రామాలయం ఎదురుగా సర్క్యులర్‌ మండపంలో రెండు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అల్లం, కరివేపాకు కలిపిన మజ్జిగను శని, ఆదివారాలతో పాటు భక్తులు ఎక్కువగా వచ్చే రోజుల్లో పంపిణీ చేయనున్నారు.

● దేవస్థానంలో పలుచోట్ల భక్తులకు మంచినీటి సరఫరాకు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్లాసుకు చేయి తగలకుండా గరిటతో మంచినీరు వేసేలా చర్యలు తీసుకున్నారు.

● రెండు నెలలుగా మూలకు చేరిన రెండు బ్యాటరీ కార్లకు వారం రోజుల్లోనే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించారు. ఆదివారం సాయంత్రం ఒక బ్యాటరీ కారును సీఆర్‌ఓ కార్యాలయం వద్ద ఉంచారు. ఇక్కడి నుంచి వృద్ధులు, వికలాంగులను వివిధ సత్రాలకు చేరవేస్తారు. మరో బ్యాటరీ కారు సోమవారం మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి వస్తుందని ఎలక్ట్రికల్‌ డీఈ సూర్యనారాయణ తెలిపారు.

● భక్తులకు ఎండ దెబ్బ తగలకుండా పశ్చిమ రాజగోపురం, మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో షామియానాలు వేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆదివారం వర్షం కురుస్తున్నందున వీటిని సోమవారం వేస్తామని తెలిపారు.

● భక్తుల క్యూలోని కుళాయిలకు మరమ్మతులు చేశారు. గొట్టాలను నాచు లేకుండా శుభ్రం చేశారు. క్యూలోని భక్తులకు సేవా సంస్థ వలంటీర్లతో మంచినీరు సరఫరా చేయిస్తున్నారు.

● మూలకు చేరిన దేవస్థానం బస్సులకు శరవేగంగా మరమ్మతులు చేయిస్తున్నారు. ఆరు బస్సులలో ప్రస్తుతం నాలుగు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. నాలుగు రోజుల్లో మరొకటి, ఈ నెలాఖరు నుంచి మరో బస్సు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రత్నగిరికి ఆటోలను నిలుపు చేసినందున భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Read latest Kakinada News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top