
అమలాపురం ఏరియా ఆస్పత్రిలో పల్లవి
● హాస్టల్‌లో తోటి వారే తోసేశారని ఫిర్యాదు
● ఆమే పడిపోయిందంటున్న
సహచర విద్యార్థినులు
అయినవిల్లి: తనను తోటి విద్యార్థులు మేడ పైనుంచి తోసేశారని ముక్తేశ్వరంలోని ఓ నర్సింగ్ కళాశాల విద్యార్థిని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు బూసి పల్లవి, ఎస్సై ఎస్.నాగేశ్వరరావు కథనం ప్రకారం.. కొత్తపేట మండలం పలివెలకు చెందిన ఆమె కళాశాలలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కళాశాల హాస్టల్‌లో ఉంటోంది. ఇటీవల తాము బ్యాగ్‌లో దాచుకున్న నగదు పోతోందంటూ ఆమెతో చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థినులు శుక్రవారం రాత్రి హాస్టల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు అందరి బ్యాగ్‌లతో పాటు పల్లవి బ్యాగ్ కూడా వెతికారు. శనివారం ఉదయం బ్రష్ చేసుకుంటూండగా ఆ ఎనిమిది మంది విద్యార్థినులూ తనను వెనుక నుంచి మేడపై రెండో అంతస్తు నుంచి గెంటేశారని పల్లవి చెబుతోంది. అయితే తోటి విద్యార్థులు మాత్రం శుక్రవారం రాత్రి కళ్లు తిరుగుతున్నాయని పల్లవి చెప్పిందని, అనంతరం వాంతులు కూడా చేసుకుందని అంటున్నారు. తమ బ్యాగ్‌లో దాచుకున్న నగదు పోవడం వాస్తవమని, ఆ డబ్బులు తానే తీసినట్టు పల్లవి ఒప్పుకుందని చెబుతున్నారు. ఆమే కళ్లు తిరిగి మేడ పైనుంచి పడిందని అంటున్నారు. పల్లవికి మూడుచోట్ల ఎముకలు విరిగాయని వైద్యులు చెబుతున్నారు. కళాశాల నిర్వాహకులు ఆమెను అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పల్లవి తల్లిదండ్రులు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పల్లవి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎస్.నాగేశ్వరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆస్పత్రిలోని వైద్యులకు పల్లవి రెండు విధాలుగా స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు చెబుతున్నారు.