
స్వామి వారి సన్నిదిలో బుల్లితెర నటుడు జాకీ
● వేంకటేశ్వరుని దర్శించిన
40 వేల మంది భక్తులు
● వాడపల్లిలో ప్రతిధ్వనించిన
గోవింద నామస్మరణ
● రూ.16.96 లక్షల ఆదాయం
ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శనివారం భక్తజన గోదారే అయ్యింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన శనివారం, ఏకాదశి పర్వదినం, స్వామి వారి నక్షత్రం శ్రవణం కలిసి రావడంతో వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. గోవింద నామస్మరణతో వాడపల్లి పరిసరాలు ప్రతిధ్వనించాయి. బస్సులు, సొంత వాహనాలపై దాదాపు 40 వేల మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. గౌతమీ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేకువజాము నుంచే వాడపల్లి చేరే రహదారి భక్తులు, వారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. స్వామి వారిని బుల్లితెర నటుడు తోట జానకిరామ్ (జాకీ) దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనం, అన్నప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ ప్రసాద విక్రయాలు, ఇతర విరాళాల రూపంలో స్వామి వారికి రూ.16,96,093 ఆదాయం సమకూరిందని ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్‌రాజు, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
వైభవంగా అధ్యయనోత్సవాలు ప్రారంభం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక తిరు కల్యాణోత్సవాలు త్వరలో జరగనున్న నేపథ్యంలో వేద పండితులు ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆళ్వారుల విగ్రహాల వద్ద వేద పండితులు వేద పఠనం చేస్తూ స్వామివారి ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించారు. దివ్య ప్రబంధ పారాయణ, బాలభోగం, నివేదన, నీరాజన మంత్రపుష్పాది పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 31 నుంచి వారం రోజుల పాటు జరగనున్న స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా అధ్యయనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఈఓ సత్యనారాయణరాజు చెప్పారు.