విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

May 5 2026 6:44 AM | Updated on May 5 2026 6:44 AM

ఎర్రవల్లి: విద్యార్థులు విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పదో పటాలం కమాండెంట్‌ జయరాజ్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పదో బెటాలియన్‌ సాయుధ చైతన్య పాఠశాలలో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఇక్కడితో ఆగిపోకుండా భవిష్యత్‌లో మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులపై అనవసర ఆర్థిక భారం మోపకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి విద్యను అభ్యసిస్తూ తమ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనంతరం పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పార్థసారధిరెడ్డి, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు నర్సింహారెడ్డి, శ్రీనివాసులు, రాజేశం, పాఠశాల హెచ్‌ఎం షేక్షావలి, ఉపాధ్యాయులు, పటాలం సిబ్బంది పాల్గొన్నారు.

ధాన్యం బస్తాలు

తరలించండి

అలంపూర్‌: కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న ధాన్యం బస్తాలు తరలించడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న అన్నారు. అలంపూర్‌ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన డివిజన్‌ స్థాయి ప్రజావాణిలో సోమవారం ఆర్డీఓ శ్రీనివాస్‌రావుకు తెలంగాణ రైతు సంఘం నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు చేసి మార్క్‌ఫెడ్‌ సంస్థ వాటిని తరలించడంలో చేతులెత్తేసిందన్నారు. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తుండటంతో ఇక్కడే తమ ధాన్యం విక్రయించారని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన అధికారులు ఆ తర్వాత వాటిని గోదాంలకు తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా కొనుగో లు కేంద్రాల్లో 50 వేల క్వింటాళ్ల ధాన్యం బస్తాలు పేరుకుపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి కేంద్రాల్లో నిలిచిన ధాన్యం బస్తాలను తరలించడానికి చర్యలు తీసుకోవాలని వినతిలో కోరారు. అధికారులు ధాన్యం బస్తాల తరలింపులో స్పందించకపోతే జాతీయ రహదారి–44పై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రం అందజేసిన వారిలో రైతు సంఘం నాయకులు మద్దిలేటి, రైతులు వెంకటేశ్వర్లు, నర్సింహరాజు, చాంద్‌బాష తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదలకు ఇళ్లు

ఇవ్వకపోతే పోరాటం

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇవ్వాలని టీఎఫ్‌టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట ధర్నాలో ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్‌ హయాంలో 900మందికి 60–75 చదరపు గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చి.. పట్టాలను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా పేదలకు మోసం మండిపడ్డారు. అర్హులైన వారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వకుండా కొన్నేళ్లుగా కాలయాపన చేస్తూ నిరుపేదలను క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ గూడు వింటారని ఆశతో ఏడాది నుంచి కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే కలుస్తూనే ఉన్నారని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం పట్టించుకోకపోతే పోరాటం తప్పదని హె చ్చరించారు. అనంతరం ఆర్డీఓ నవీన్‌కు వినతిపత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement