ఫిర్యాదులు పరిష్కారంలో అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులు పరిష్కారంలో అలసత్వం వద్దు

May 5 2026 6:44 AM | Updated on May 5 2026 6:44 AM

గద్వాల: ప్రజావాణి ఫిర్యాదులపై పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలతో 74 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు కారణాలు పేర్కొంటూ ఫిర్యాదుదారునికి అక్‌నాలెడ్జ్‌మెంట్‌ పంపాలన్నారు. అలాగే మండలాల్లో అధికారులు ప్రజావాణిని సక్రమంగా నిర్వహిస్తే చిన్నపాటి సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జనాభా గణనలో భాగంగా ఏప్రిల్‌ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రతి పంచాయతీ నుంచి కనీసం వందమంది పాల్గొనేలా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. సర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లడ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు.

వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి

వన మహోత్సవంలో భాగంగా వర్షాకాలంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు ఆయా శాఖల అధికారులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాకు 11 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, ఇందుకు అనుగుణంగా నర్సరీలలో మొక్కలను సిద్ధం చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు మొక్కలు పెంచడానికి తమ పరిధిలో ఎక్కడెక్కడ అవకాశం ఉందో గుర్తించి నివేదిక సిద్ధం చేయాలన్నారు. జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు, డీఎఫ్‌ఓ ఆశీస్‌సింగ్‌, ఎస్‌డీసీ కృష్ణ, ఏఓ భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు

కేంద్రాలపై పర్యవేక్షణ

వరిధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన వరిధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీసీలో ఆయన పాల్గొని మాట్లాడారు. విజిలెన్స్‌ అధికారులు తమ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలన్నారు. రైతులతో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలు ఓపీఎంఎస్‌లో ఎంట్రీ చేసి సకాలంలో వారికి డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ స్వామికుమార్‌, డీఎం విమల తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement