సరిహద్దులు దాటిన లింకులు | - | Sakshi
Sakshi News home page

సరిహద్దులు దాటిన లింకులు

May 5 2026 6:44 AM | Updated on May 5 2026 6:44 AM

ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ నకిలీ ధ్రువపత్రాల దందా

కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా

సబ్‌ రిజిస్ట్రార్‌ ముద్రలు గుర్తింపు

పోలీస్‌, రెవెన్యూ అధికారుల

విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి..

గట్టు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ కేంద్రంగా సాగిన నకిలీ ధ్రువపత్రాల తయారీ దందా వ్యవహారం ఏకంగా మూడు రాష్ట్రాలకు విస్తరించింది. ఇటీవల అయిజలోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌ను రెవెన్యూ అధికారులు తనిఖీ చేయగా నకిలీ ధ్రువపత్రాల ముద్రింపు దందా వెలుగు చూసిన విష యం తెలిసిందే. అయితే అయిజ కేంద్రంగా కొనసాగిన నకిలీ పత్రాల సృష్టిలో గట్టు మండలానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, పైరవీకారుల ప్రమే యం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అయిజ టు గట్టు’ కథనం మండలంలో చర్చనీయాంశంగా మారింది. నకిలీ పత్రాల దందాలో పాత్రదారులు, సూత్రదారులను గుర్తించి.. శిక్షిస్తారా.. లేక ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేస్తారా.. అన్న సందేహాలను ఇక్కడి వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కల్యాణలక్ష్మి, రైతుబీమా, భూ భారతి పోర్టల్‌కు సంబంధించి నకిలీ పత్రాలతో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నకిలీ దందాలో భాగస్వాములుగా ఉన్న వారిలో ఇప్పటికే టెన్షన్‌ నెలకొంది. ఎక్కడ తమ పేర్లు బయట పడతాయోనని ఆందోళన చెందుతున్నారు. నకిలీ దందా నుంచి బయట పడేందుకు మార్గాలనే వెతుక్కుంటున్నారు. ఇప్పటికే ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఉన్న కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ను రెవెన్యూ, పోలీస్‌ అధికారులు స్వాధీనం చేసుకుని గుట్టు విప్పే పనిలో ఉన్నట్లు సమాచారం.

దిమ్మతిరిగే వాస్తవాలు..

కంప్యూటర్‌ లోగుట్టును విప్పుతున్న క్రమంలో అధికారులు దిమ్మతిరిగే వాస్తవాలను గుర్తించినట్లు తెలిసింది. ఈ నకిలీ దందా వ్యవహారం కేవలం అయిజ, గట్టు మండలాలకే కాకుండా.. ఏకంగా అంతర్‌ రాష్ట్ర స్థాయికి చేరుకున్నట్లు తెలిసింది. కర్ణాటకతోపాటుగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన స్టాంపులు, ఆధార్‌ కార్డులను అధికారులు గుర్తించినట్లు సమాచారం. కర్ణాటకలోని గుల్బర్గా సబ్‌ రిజిస్ట్రార్‌ స్టాంపు, సంతకం ఉన్న స్టాంపు, ఆంధ్రప్రదేశ్‌లోని పత్తికొండ ప్రాంతానికి చెందిన అధికారుల ముద్రలు, సంతకాలు ఉన్న స్టాంపులను గుర్తించినట్లు సమాచారం. ఇక గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ల సంతకాలకు సంబంధించిన స్టాంపు (ముద్ర)లను సైతం అధికారులు గుర్తించారు. వీటితోపాటు డిగ్రీ, ఎస్సెస్సీ సర్టిఫికెట్లు, ఆయా బ్యాంకులకు సంబందించిన నో డ్యూలు ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెలుగు చూసింది. అయిజ ప్రింటింగ్‌ ప్రెస్‌ కేంద్రంగా కొనసాగిన నకిలీదందా వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement