గద్వాల క్రైం: గంజాయి, డ్రగ్స్, పొగాకు వంటి మత్తు పదార్థాల బారిన పడితే భవిష్యత్ అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉంది.
చెడు వ్యవసనాలపై ఉక్కుపాదం మోపుతూ, చట్టాలపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – పల్లె ప్రగతి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసుశాఖ ప్రధాన అంశమైన పిల్లల రక్షణ, మత్తు పదార్థాల రహిత నవ సమాజ నిర్మాణ కార్యాక్రమాన్ని వారం రోజల పాటు వారోత్సవాల కార్యచరణ చేపట్టింది. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. విక్రేతలపై కేసులు నమోదు చేసి, బహిరంగ మార్కెట్‌లో వాటి సరఫరాకు అడ్డుకట్ట వేసింది. తాజాగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో అధికారులు ప్రజల వద్దకు చేరుకుని చట్టాలపై ప్రజలను చైతన్యం పరుస్తున్నారు. సోమవారం నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాల, రైల్వేస్టేషన్, బస్టాండ్, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు, ఫ్యాక్టరీలు తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
చెడు వ్యసనాలకు ఆకర్శితులై..
ప్రభుత్వం మత్తు పదార్థాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు ప్రజల్లోకి పూర్తి స్థాయిలో చేరడం లేదనే విమర్శలు లేకపోలేదు. మరోవైపు అధికారులు నిరంతరం నిఘా పెట్టినా చెడ్డు వ్యవసనాలకు ఆకర్శితులైన కొందరు తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన యువతపై పోలీసు శాఖ నిఘా ఉంచి, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరోవైపు మహిళలపై జరుగుతున్న దాడులు, చిన్నారులపై జరుగుతున్న వికృత చేష్టలపై (బ్యాడ్ టచ్, గుడ్ టచ్) విషయాలు తెలియజేస్తున్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే సమస్యలు, లైగింక దాడులు, పోక్సో కేసుల తీవ్రత, లింగ సమానత్వం, పౌష్టికాహారం వినియోగంతో పాటు విద్య, వైద్య సదుపాయాలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్య అంటే కేవలం ఉద్యోగం, డబ్బు సంపాదించడం కాదనే విషయాన్ని యువత గుర్తించాలని, జీవనశైలి అలవరుస్తుందన్నారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ అధికారులు, భరోసా సెంటర్ నిర్వాహకులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజాప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు, విద్యావంతులు, సామాజిక కార్యకర్తలతో మమేకమై మత్తు పదార్థాల నిర్మూలనపై పోరాడాలని సూచిస్తున్నారు. గంజాయి తాగినా, అమ్మినా వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలనే చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావాలని భావిస్తున్నారు.
ప్రత్యేక నిఘా..
గ్రామాల్లో 15 నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువకుల జాబితాను గ్రామాల వారీగా సిద్ధం చేసి వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. వేసవి సెలువుల నేపథ్యంలో వారిని స్కిల్ డెవలప్‌మెంట్ వైపు మళ్లించేలా చూస్తున్నారు. స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకునే సమయంలో యువత తీసుకునే మత్తు పదార్థాలు, గంజాయి వినియోగం వంటి వాటిపై మఫ్టీ పోలీసులు నిరంతరం కూపీలాగుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలన వారోత్సవాలు
ప్రజాపాలన–పల్లె ప్రగతి కార్యక్రమంలో కసరత్తు
మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం
అన్ని శాఖల సమన్వయంతోకార్యక్రమాలు
చట్టాలపై అవగాహన అవసరం


