ప్రశాంతంగా నీట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌

May 4 2026 7:37 AM | Updated on May 4 2026 7:37 AM

911మంది అభ్యర్థులు హాజరు

బాలుర జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ శ్రీనివాసరావు

బాలుర పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులను తనిఖీ చేస్తున్న పోలీసు సిబ్బంది

ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల వద్ద అభ్యర్థులు, వారి కుటుంబీకుల సందడి

గద్వాల: జిల్లాలో నీట్‌–యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా నాలుగు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. విద్యార్థులను ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు.. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లే క్రమంలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్‌ కళాశాలలు, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాల్లో మొత్తం 930 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 911మంది అభ్యర్థులు హాజరైనట్లు పరీక్షల కో–ఆర్డినేటర్‌ దేవేందర్‌రెడ్డి తెలిపారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్‌, రెవెన్యూ, విద్యాశాఖల అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష కొనసాగగా.. ఎస్పీ శ్రీనివాసరావు, ఏఎస్పీ శంకర్‌ పర్యవేక్షించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు కో–ఆర్డినేటర్‌ దేవేందర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement