అలంపూర్: క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యల పరిష్కారం నిమిత్తం సోమవారం ఆర్డీఓ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరిగే ప్రజావాణిలో అన్ని శాఖల డివిజన్‌స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు డిప్యూటీ తహసీల్దార్లు వేణుగోపాల్‌రెడ్డి, వెంకటరమణలను పర్యవేక్షణ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. ప్రజావాణిలో అందే ఫిర్యాదులను సీజీజీ ప్రజావాణి పోర్టల్‌లో నమోదుచేసి.. అంగీకార పత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
రేపు జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: వరంగల్‌లో ఈ నెల 10న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్, 17న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను మంగళవారం ఉదయం 9 గంటలకు స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో పాటు వ్యవసాయ పనులు ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు. అప్పటికే జాతర మైదానంలో సిద్ధంచేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీతో జాతర మైదానం కిక్కిరిసిపోయింది. కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాదాపు 15వేల మంది భక్తులు మైసమ్మను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారి రామేశ్వరశర్మ తెలిపారు.
‘పాలమూరు’కు
జాతీయ హోదా ఇవ్వాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా సాధనకు ఎంపీ డీకే అరుణ కృషి చేయాలని సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి పరమేశ్‌గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మే 10న రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్నారని, పాలమూరుకు జాతీయ హోదా ప్రకటన చేయించాలని కోరారు. 2014లో ఎన్నికల ముందు పాలమూరు సాక్షిగా ఆనాటి సుష్మాస్వరాజ్ బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరుకు జాతీయ హోదా కల్పిస్తామని ఇచ్చిన మాటను గుర్తు చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చినా పాలమూరుకు ఇవ్వాల్సిన జాయతీ హోదాను మరిచిపోందని విమర్శించారు. జాతీయ హోదా కల్పించకుండా బీజేపీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ఎంపీగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపించిన పాలమూరుకు మాత్రమే జాతీయ హోదా రాలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకత్వం చొరవ చూపడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిపారు. కృష్ణ బేసిన్‌లో పాలమూరు క్యాచ్‌మెంట్ ఏరియా 70శాతం ఉన్న పాలమూరుకు దక్కాల్సిన నీళ్ల వాటా దక్కడం లేదని ఆరోపించారు. ఈనెల 10న రాష్ట్రానికి వచ్చే ప్రధాని నోటితో పాలమూరుకు జాతీయ హోదాను ప్రకటించేలా ఇక్కడి బీజేపీ నాయకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వంనుంచి మనకు ప్రత్యేకంగా ఒరిగిందేమి లేదని అసహనం వ్యక్తం చేశారు.
అయిజ టు గట్టు
● నకిలీ పత్రాల తయారీ దందాలో గట్టుకు లింకులు
● కూపీ లాగుతున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు
– వివరాలు 8లో..


