మళ్లీ మొదటికొచ్చింది | - | Sakshi
Sakshi News home page

మళ్లీ మొదటికొచ్చింది

May 3 2026 7:41 AM | Updated on May 3 2026 7:41 AM

ప్రయాణానికి ప్రతికూలంగా అంతర్రాష్ట్ర రహదారి

అయిజ: అంతర్రాష్ట్ర రహదారి కర్నూలు– రాయచూరు రోడ్డుపై అయిజ సమీపంలో పెద్దవాగుపై సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించిన కాజ్‌వే పూర్తిగా శిథిలమైంది. రక్షణ గోడల రాళ్లు ఊడిపడ్డాయి. శిథిలమైన రోడ్డుపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే శిథిలమైన కాజ్‌వేను తొలగించి.. అదే ప్రదేశంలో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించేందుకు గతేడాది రూ.18 కోట్ల అంచనాతో ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. 2024– 25 ఆర్థిక సంవత్సరం ముగియడంతో 2025– 26 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం నుంచి ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అధికారులు ప్రతిపాదనలు పంపిన అనంతరం ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం, వాటికి నిధుల మంజూరు, సకాలంలో విడుదల చేయడం వంటివి చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరం సమయం ముగియకముందే ప్రక్రియ మొత్తం పూర్తవ్వాల్సి ఉంటుంది.

శిథిలావస్థలో నాలుగు కల్వర్టులు..

మండలంలోని వెంకటాపురం నుంచి అయిజ పట్టణం వరకు గతంలో నిర్మించిన కల్వర్టులు శిథిలమయ్యాయి. బీటీ రోడ్డుపై అనేక చోట్ల మోకాలులోతు గోతులు ఏర్పడ్డాయి. వాటిని తొలగించి నూతనంగా కల్వర్టులు నిర్మించేందుకు గతేడాది రూ.3 కోట్లు నిధులు మంజూరయ్యాయి. టెక్నికల్‌ డ్రాయింగ్‌ అప్రూవల్‌ కాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చుట్టపు చూపుగా వెళ్లి పరామర్శించడం, మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం చేస్తున్నారే గాని సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు వెళ్లలేని దుస్థితి

నిధులున్నా ప్రారంభించని కల్వర్టు పనులు

ఇప్పటికీ పూర్తికాని డ్రాయింగ్‌ అప్రూవల్‌

కొత్తగా ప్రతిపాదనలు పంపాలంటున్న ప్రభుత్వం

Advertisement
 
Advertisement
Advertisement