వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

May 3 2026 7:41 AM | Updated on May 3 2026 7:41 AM

గద్వాల: విద్యార్థులు చదువుతోపాటు వివిధ రకాల కళల్లోనూ రాణించాలని, ఇందుకోసం బాలభవన్‌లో వివిధ అంశాలపై ఇచ్చే వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. శనివారం గద్వాల బాల భవన్‌లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ ఎమ్మెల్యే పాగ పుల్లారెడ్డి 107వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవిలో పిల్లలు సెల్‌ఫోన్లు, టీవీలు చూస్తూ సమయాన్ని వృథా చేయకుండా బాలభవన్‌లో నేర్పించే శాసీ్త్రయ, జానపద నృత్యం, చిత్రలేఖనం, సంగీతం తదితర అంశాలపై శిక్షణ పొందితే గొప్ప కళాకారులుగా రాణించే అవకాశం ఉందన్నారు. ఒకే అంశంలో కాకుండా విభిన్న రంగాల్లో శిక్షణ పొంది బహుముఖ ప్రజ్ఞశాలురుగా పేరు తెచ్చుకోవాలన్నారు. విద్యార్థులు తాము నేర్చుకునే నృత్యం, సంగీతం, వేదికలపై స్టేజీఫియర్‌ లేకుండా ధైర్యంగా ప్రదర్శించాలన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా త్వరలో విద్యా వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒకరోజు బాలభవన్‌లో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు కలెక్టర్‌ బాలభవన్‌ విద్యార్థులతో నేర్చుకునే వివిధ అంశాల గురించి వారి భవిష్యత్‌ లక్ష్యాల గురించి మాట్లాడారు. అంతకు ముందు బాలభవన్‌ సూపరింటెండెంట్‌ విజయలక్ష్మి పూర్వ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చూపిన ప్రతిభ సాధించిన అవార్డులు అక్కడ ఇస్తున్న శిక్షణ గురించి క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, డాక్టర్‌ అనంతలక్ష్మి, విద్యాశాఖ అధికారులు శ్రీనివాసులు, మైఖేల్‌, సత్యం, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement