గద్వాల: అబద్ధపు హామీలతో నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఈ క్రమంలోనే బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే జనాగ్రహ సభకు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం ఆమె స్థానిక బంగ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారం కోసం అబద్ధపు హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జనాగ్రహసభ నిర్వహిస్తున్నామని, ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు. పదేళ్లు బీఆర్‌ఎస్ పాలించి రాష్ట్రాన్ని అప్పులకుప్పుగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను నమ్మి మోసపోయిన ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. గతంలో వాజ్‌పేయి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ అని, అనంతరం మోదీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంది కూడా అదే పార్టీ అన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో బీజేపీ జెండా ఎగురవేస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలోనూ పార్టీ బలోపేతం అవుతుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. దేశ ప్రధానిగా మూడోసారి ఎన్నికై న నరెంద్రమోదీ తొలిసారిగా ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వాసుదేవరావు, రామాంజనేయులు, రాంచంద్రారెడ్డి, వెంకట్రాములు, రవికుమార్, శివారెడ్డి, రాజగోపాల్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.


