● ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లోఅందరూ భాగస్వాములు కావాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా యంత్రాంగంతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అన్నిశాఖల అధికారులు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు, పౌరులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వం అమలుచేస్తున్న గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతుభరోసా, రైతుబీమా, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను తెలియజేయడంతో పాటు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, ఇందిరమ్మ జీవిత బీమా పథకాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కాగా, జిల్లాలో నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాకుండా చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులు ఫర్టిలైజర్ దుకాణాలను తరచుగా తనిఖీలు చేపట్టాలన్నారు. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. ఈ నెల 4 నుంచి నిర్వహించే రైతువారం కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు.
కార్మికుల కృషితోనే అభివృద్ధి..
సంఘటిత, అసంఘటిత కార్మికుల కృషితోనే ఏరంగంలోనైనా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్‌లో కార్మిక ఉపాధి, శిక్షణ, కర్మాగారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ కార్మిక దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజ అభివృద్ధికి కార్మికు లు ఎంతో బాధ్యతతో పనిచేస్తుంటారన్నారు. కార్మికశాఖ ఆధ్వర్యంలో అందించే లేబర్ కార్డులను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు..
ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్లను లబ్ధిదారులు వేగవంతంగా పూర్తిచేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అఽధికారులతో ఆయన సమీక్షించారు. ఇళ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పంచాయతీ కార్యదర్శుల పనితీరును ఎంపీడీఓలు పర్యవేక్షిస్తూ.. ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, లీగల్ సర్వీసెస్ అఽథారిటీ ప్రతినిధి రాజేందర్, సహాయ కార్మిక అధికారి వేణుగోపాల్, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నుషిత, బీసీ సంక్షేమశాఖ అధికారి అక్బర్ బాషా, డీఈఓ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీఆర్డీవో ముసాయిదాబేగం ఉన్నారు.


