అలంపూర్: రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న ధాన్యం తరలించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.వెంకటస్వామి ఆరోపించారు. శుక్రవారం అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తున్న మొక్కజొన్న ధాన్యాన్ని సకాలంలో తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. అలంపూర్ మార్కెట్‌యార్డు కొనుగోలు కేంద్రంలోనే దాదాపు 40వేల బస్తాలు నిల్వ ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ధాన్యం కాంటా చేసిన తర్వాత రైతులకు కనీసం రశీదు కూడా ఇవ్వడం లేదన్నారు. దీంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల్లోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న, వెంకటేశ్వర్లు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
మదనగోపాలుడి రథోత్సవం
కొల్లాపూర్: పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌లో శ్రీరుక్మిణీ సత్యభామ సమేత మదనగోపాలస్వామి రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా సాగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవానికి సమీప గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పచ్చటి తోరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి.. వేదమంత్రోచ్ఛారణ, భాజాభజంత్రీలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సురభి రాజవెంకటలక్ష్మాదిత్యారావు, సర్పంచ్ పద్మమ్మ, గోవిందుగౌడ్, భీంరెడ్డి, ఉపసర్పంచ్ ప్రమోద్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


