జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మెగా జాబ్‌మేళా శుక్రవారం జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. గురువారం శిల్పారామంలో జాబ్‌మేళా ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు. జాబ్ మేళాలో హైదరాబాద్ నుంచి సుమారు 80 కంపెనీలు, జిల్లాలో స్థానికంగా ఉన్న 35 కంపెనీలు పాల్గొననున్నాయని వెల్లడించారు. వీరికోసం 120 స్టాళ్లను ఏర్పాటు చేశామని, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 10 వేల మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై మున్సిపల్, యువజన సంక్షేమ క్రీడలు, పంచాయతీ శాఖ, విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, మెప్మా, ఉపాధి కల్పన అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్, యువజన సంక్షేమ శాఖ అధికారులు సమన్వ యం చేసుకొని జాబ్ మేళాకు టెంట్లు, కుర్చీలు, టేబుళ్లు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే స్టేజీ, స్టాళ్లలో కావాల్సిన సౌకర్యాలను రెవెన్యూ, జిల్లా విద్యా శాఖ అధికారులు చూసుకోవాలన్నారు.
పలువురు మంత్రుల రాక..
మేళాలో మొత్తం 30 కౌంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తారని, నమోదు అనంతరం అభ్యర్థులను హాల్‌లో కూర్చోబెట్టి, ప్రారంభోత్సవం తర్వాత వివిధ కంపెనీల స్టాళ్ల వద్ద ఇంటర్వ్యూలకు అనుమతి ఇస్తారన్నారు. ఎంపికై న అభ్యర్థులకు అక్కడే నియామక పత్రం అందజేస్తారన్నారు. అలాగే పోలీస్ శాఖ రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతోపాటు, శిల్పారామం వైపు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు తగిన సిబ్బందిని నియమించాలని సూచించారు. మేళాకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరు కానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.


