గద్వాల: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) పథకం అమలులో జిల్లా ముందుండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ వీసీ హాల్‌లో సంబంధిత అధికారులతో పథకం అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తి సమాచార ఆధారిత పాలన ద్వారానే జిల్లా అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. ప్రతిశాఖ తమ లక్ష్యాలు, సాధించిన ఫలితాలను కచ్చితమైన గుణాంకాలతో ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. చిన్న పురోగతినైనా నమోదు చేయాలని.. ఎక్కడా జీరో చూపించకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ప్రస్తుత ప్రగతి మెరుగ్గా ఉండాలని.. ఇందుకు ప్రతినెలా డేటాను సరిచూసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సూచికలను సక్రమంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పతకాలు ప్రజలకు సమర్ధవంతంగా చేరుతాయని తెలిపారు. సమావేశంలో డీఏఓ వీరప్ప, డీఆర్డీఓ ముషాహిదాబేగం ఉన్నారు.
విద్యావ్యవస్ధ బలోపేతానికి కృషి
జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచి, విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు పాల్గొనగా.. ఆమె పలు సూచనలు చేశారు. పదో తరగతి, ఇంటర్‌లో పెయిల్ ఆయిన విద్యార్ధులను అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూచించారు. మే 11 నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాగా, ఇటీవల ఫిన్లాండ్ పర్యటనకు వెళ్లిన కలెక్టర్ రిజ్వాన్ బాషా అక్కడి విద్యా విధానం విశేషాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. ఫిన్లాండ్‌లో వృత్తి విద్యాకోర్సులు, డిజిటల్ బోధనా పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. వీసీలో డీఈఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.


