ఉజ్వల భవిష్యత్‌కు చదువే పునాది | - | Sakshi
Sakshi News home page

ఉజ్వల భవిష్యత్‌కు చదువే పునాది

May 1 2026 5:57 AM | Updated on May 1 2026 5:57 AM

గట్టు: ఉజ్వల భవిష్యత్‌కు చదువే పునాది అని.. చిన్నచిన్న కారణాలతో ఎవరూ కూడా మధ్యలోనే చదువును నిలిపివేయొద్దని అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం గొర్లఖాన్‌దొడ్డి రైతువేదికలో జిల్లా మహిళా, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే తరాలు బలంగా ఎదగడానికి చదువు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు అవాంఛనీయ ప్రభావాలు, ఆకర్షణలకు లోనై చదువును అశ్రద్ధ చేయొద్దని సూచించారు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా చదువులో రాణించి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ముఖ్యంగా బాల్యవివాహాలతో శారీరక, మానసిక ఎదుగుదల కుంటుపడుతుందని తెలిపారు. బాల్యవివాహాల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. బాల్యవివాహం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా సెల్‌ఫోన్‌ అవసరానికి మించి వినియోగించొద్దని సూచించారు. సైబర్‌ నేరగాళ్ల బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అనాథ పిల్లల చదువుకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలను వివరించారు. సర్పంచ్‌ శ్వేత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారిణి సునంద, డీసీపీఓ నర్సింహ, ఎంపీడీఓ చెన్నయ్య, ఎస్‌ఐ శేఖర్‌గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి రవి, ఎంవీ ఫౌండేషన్‌ కోఆర్డినేటర్‌ కిరణ్‌, చైల్డ్‌ లైవ్‌ సూపర్‌వైజర్‌ నవీన్‌, హబ్‌ కోఆర్డినేటర్‌ సరోజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement