గద్వాల: సీడ్ కంపెనీలు రైతులకు చెల్లించాల్సిన డబ్బులను సకాలంలో చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తే సహించమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో సీడ్ కాటన్‌పై వ్యవసాయశాఖ అధికారులు, సీడ్ ఆర్గనైజర్లు, కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సీడ్ పత్తికి సంబంధించిన పలు కంపెనీలు కొన్ని నెలలుగా బకాయి లు చెల్లించకపోవడంతో రైతులు, ఆర్గనైజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సీడ్ కంపెనీలు ఎలాంటి ఆలస్యం లేకుండా పెండింగ్ డబ్బులను వెంటనే చెల్లించాలని.. లేనిపక్షంలో సదరు కంపెనీ యాజమాన్యాలకు షోకాజు నోటీసులు జారీ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా కంపెనీలు నిర్ణీత గడువులోగా విత్తనాల సర్టిఫైడ్ పరీక్షలు పూర్తిచేసి.. నివేదికలు సమర్పించాలన్నారు. రైతులు, ఆర్గనైజర్లు, కంపెనీల మధ్య రౖతైపాక్షిక ఒప్పందాలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఒప్పందాల్లో చెల్లింపుల గడువు, బాధ్యతలు, గడువులోగా డబ్బులు చెల్లించకుంటే జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకునేలా అన్ని అంశాలను పొందుపర్చాలని సూచించారు. ఒప్పందం లేకుండా విత్తన కొనుగోలు లేదా ఉత్పత్తి కార్యకలాపాలు అనుమతించబోమని అన్నారు. అదే విధంగా సీడ్ కంపెనీలు రైతులకు తగిన శిక్షణ, సాంకేతిక మార్గదర్శకాలు అందించడం లేదని గుర్తించామని.. ఇకనుంచి క్షేత్రస్థాయి సందర్శనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో వేలాది రైతులు సీడ్‌పత్తి సాగుచేస్తున్నారని.. కంపెనీలు, ఆర్గనైజర్లు పరస్పర సహకారం లేకపోతే సీడు వ్యవస్థనే దెబ్బతినే ప్రమాదముందని తెలిపారు. అనంతరం జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎరువులు, విత్తనాల దుకాణాల్లో వ్యవసాయశాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలన్నారు. దుకాణాల వద్ద స్టాక్ వివరాలు, ధరల పట్టి క, రికార్డుల నమోదు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ శంకర్, డీఏఓ వీరప్ప తదితరులు ఉన్నారు.
సీడ్ ఆర్గనైజర్లు, కంపెనీలు నిబంధనలు పాటించాలి
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్


