ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం అర్చకులు భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా.. మొదటి రోజు ఉదయం ఆలయంలో పంచామృతాభిషేకం, వాస్తుపూజ హోమం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణ, పల్లకీసేవను వేద పండితుల మంత్రోచ్ఛరణలతో చేశారు. అదేవిధంగా రాత్రి తెప్పతేరు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్‌కుమార్, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ ప్రత్యేక పూజలు
ఉత్సవాలను పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని ఎస్పీ తోట శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అభయాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఈఓ పురేందర్‌కుమార్ ఆయనకు శేషవస్త్రాలతో సత్కరించగా, అర్చకులు మారుతిచారి తీర్థ ప్రసాదాలను అందించి ఆలయ విశిష్టతను గురించి వివరించారు. ఎస్పీ వెంట సీఐ ప్రదీప్‌కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.


