అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా | - | Sakshi
Sakshi News home page

అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా

Apr 29 2026 7:42 AM | Updated on Apr 29 2026 7:42 AM

రికార్డు స్థాయిలో

18వేల మెగావాట్ల వినియోగం

ఆర్టిజన్‌ కార్మికులకు త్వరలోనే తీపికబురు

టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి పాటిల్‌

కల్వకుర్తి/చారకొండ/మన్ననూర్‌: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్‌ డిమాండ్‌ 18వేల మెగావాట్లకు చేరినప్పటికీ.. వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా కొనసాగిస్తున్నామని టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రంతో పాటు 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో నెలకొన్న సమస్యలను సిబ్బందితో తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో పెరిగిన విద్యుత్‌ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసినట్లు వివరించారు. ముఖ్యంగా ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్ల మరమ్మతు, లోడ్‌ మేనేజ్‌మెంట్‌ చర్యలతోనే ఈ స్థాయిలో సరఫరా సాధ్యమైందన్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో విద్యుత్‌ వినియోగం మరింత పెరిగే అవకాశముందని.. అయినప్పటికీ సరఫరాలో ఎలాంటి అంతరాయం రానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. సిబ్బంది సమన్వయంతో పనిచేసి.. ఎక్కడా లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సబ్‌స్టేషన్ల ఆపరేటర్లు, లైన్‌మన్‌లే విద్యుత్‌ సంస్థకు నిజమైన బలమని చెప్పారు. వేసవి తీవ్రతలోనూ, అధిక లోడ్‌తోనూ నిరంతరం పనిచేస్తూ ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా అందిస్తున్న సిబ్బంది సేవలు ప్రశంసనీయమన్నారు. విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్‌ కార్మికులకు త్వరలో శుభవార్త అందిస్తామని సీఎండీ పేర్కొన్నారు. వారి సమస్యలను సమగ్రంగా పరిశీలించి.. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదే విధంగా చారకొండ మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. విద్యుత్‌ కార్యాలయ భవనంతో పాటు ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని స్థానిక అధికారులకు సూచించారు. కాగా, ఆర్జిజన్‌ కార్మికులను కన్వర్షన్‌ చేయాలని కోరుతూ ఆ సంఘం డివిజన్‌ అధ్యక్షుడు నాయిని పరంజ్యోతి సీఎండీకి విజ్ఞప్తి చేశారు.

● అమ్రాబాద్‌ మండలం మాచారంలో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం అమలు తీరును సీఎండీ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజన రైతులు ఏర్పాటుచేసుకున్న సోలార్‌ సిస్టమ్‌, బోరుబావులతో పాటు పండ్ల తోటల సాగు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రైతు పెద్దిరాజు వ్యవసాయ క్షేత్రంలో గిరిజన రైతులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వ్యవసాయ రంగంలో గిరిజన రైతులు సాధిస్తున్న ప్రగతిని ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ సీఈ బాలస్వామి, ఎస్‌ఈ వెంకటనర్సింహారెడ్డి, డీఈటీ రవికుమార్‌, డీఈఈ శ్రీధర్‌రెడ్డి, ఏడీఈలు ఆంజనేయులు, శంకరయ్య, ఎస్‌ఓ పార్థసారధి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement