గద్వాల క్రైం: జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. పోలీసు అధికారులు, సిబ్బంది శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ.. అనుమానాస్పద కేసులను వేగంగా విచారించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా రాత్రివేళ పెట్రోలింగ్, గస్తీని ముమ్మరం చేయాలన్నారు. ఇదివరకే నమోదైన కేసులను పారదర్శకంగా విచారించి.. బాధితులకు భరోసానివ్వాలని సూచించారు. వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటుచేయాలని సిబ్బందిని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులపై ప్రత్యేకంగా విచారణ చేపట్టాలన్నారు. ఇసుక, మట్టి, రేషన్ బియ్యం అక్రమ రవాణాతో పాటు నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి, పేకాట వంటి వాటిని కట్టడి చేయాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఉంచాలన్నారు. స్టేషన్‌లో నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 27 నుంచి మే 2వ తేదీ వరకు ప్రతి మండలంలో చైల్డ్ అండ్ ఉమెన్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, ప్రదీప్‌కుమార్, ఎస్‌ఐలు, శ్రీకాంత్, శేఖర్, శ్రీహరి, నందికర్ ఉన్నారు.


