గద్వాల క్రైం: బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భరోసా కేంద్రం నిర్వాహకులు శివాణి, శిరీష కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కౌమర దశలోనే బాలికలకు వివాహం చేయడం వల్ల భవిష్యత్‌లో అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. అమ్మాయిలకు 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని.. ఎక్కడైనా బాల్యవివాహం చేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అదే విధంగా యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులై విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని.. వారిలో మార్పునకు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బీచుపల్లి ఈఓగా
బాధ్యతల స్వీకరణ
ఎర్రవల్లి: బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయ ఈఓగా పురేందర్ కుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా అభయాంజనేయస్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది, అర్చకులతో నిర్వహించిన సమావేశంలో ఆలయ అభివృద్ధి, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు.
సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని.. సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జ్యోతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే నెల 1న మహబూబ్‌నగర్‌లో జాబ్ మేళా ఉంటుందని.. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు ముందుగా http://satg.telangana.gov.in/prajapalana వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.


