జనగణనకు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

జనగణనకు సహకరించండి

Apr 28 2026 7:47 AM | Updated on Apr 28 2026 7:47 AM

అన్ని వర్గాలు స్వీయ గణనలోభాగస్వాములు కావాలి

అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

గద్వాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన–2027కు అందరూ సహకరించాలని అదనపు కలెక్టర్‌, జిల్లా ప్రధాన జనగణన అధికారి వి.లక్ష్మీనారాయణ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావుతో కలిసి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనగణనలో భాగంగా ఈ నెల 26 నుంచి మే 10వ తేదీ వరకు స్వీయగణనకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఎన్యూమరేటర్ల అవసరం లేకుండానే ప్రజలే తమ వివరాలను స్వయంగా సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేసుకునే సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. https:// se.census.gov.in వెబ్‌సైట్‌లో వివరాల నమోదుకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. అన్ని వర్గాల ప్రజల స్వీయగణనలో భాగస్వాములై జిల్లాను రాష్ట్రంలోనే ముందుండేలా సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, సీపీఓ పాపయ్య ఉన్నారు.

పెట్రోలియం కొరత నివారణకు చర్యలు

జిల్లాలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేకుండా సరఫరా చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్‌ వి.లక్ష్మీనారాయణ అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఎనర్జీ సప్లయ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు, పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్‌బంకుల డీలర్లకు ఆయిల్‌ కంపెనీలు క్రెడిట్‌ ప్రాతిపదికన పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేసేవారని.. ప్రస్తుతం ముందే డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొనడంతో సమస్య ఉత్పన్నమైందన్నారు. మూడురోజులుగా ఆంధ్రప్రదేశ్‌ పెట్రోల్‌ బంకుల్లో స్టాక్‌ లేనందున కర్నూలు, సమీప ప్రాంతాల ప్రజలు పెట్రోల్‌, డీజిల్‌ కోసం జిల్లాకు వస్తుండటంతో కొరత ఏర్పడిందన్నారు. పెట్రోల్‌బంకుల రోజువారీ రిపోర్టు ఆధారంగా ఇంధనం కోసం బుక్‌ చేసిన వెంటనే కంపెనీలు సకాలంలో సరఫరా చేసేలా పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామికుమార్‌, కమిటీ సభ్యులు వీరప్ప, సునంద, నుషిత ఉన్నారు.

అవకాశాలను అందిపుచ్చుకోవాలి

నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా క్రీడలు, యువజన సర్వీసులశాఖ ఆధ్వర్యంలో మే 18నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాస్థాయిలో మే 1న మహబూబ్‌నగర్‌లో నిర్వహించే జాబ్‌మేళాలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించే యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ సమ్మిట్‌కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.

అర్జీలు సత్వరం పరిష్కరించాలి

ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 61 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం ఆయా శాఖల అధికారులకు పంపించారు. నిర్ణీత సమయంలోగా ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఇన్‌చార్జి డీవైఎస్‌ఓ రామలింగేశ్వర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement