గద్వాల: అక్షరాస్యతలో జిల్లాను ముందంజలో నిలిపేందుకు గాను ప్రతి ఒక్కరికీ చదువు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాల్సిన అవసరముందని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద బడిబాట ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఖాళీ సమయాల్లో నిరక్షరాస్యులైన పెద్దలకు అక్షరాలు నేర్పించాలని సూచించారు. చదువు మధ్యలో మానేసిన వారి కోసం ప్రభుత్వం సార్వత్రిక విద్యా కోర్సుల ద్వారా మరో అవకాశం కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ వసతిగృహాల్లో కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు వర్తించే మధ్యాహ్న భోజన పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. కాగా, చదువు మనిషికి ఆత్మస్థైర్యాన్ని, స్వయం సమృద్ధిని ఇస్తుందని పేర్కొంటూ అధికారులు, విద్యార్థులతో ప్రతిజ్జ చేయించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి నుషిత, అక్బర్‌బాషా, రవీంద్రబాబు పాల్గొన్నారు.


