ఆర్టీసీ కార్మికులను గెలిపించిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికులను గెలిపించిన ప్రభుత్వం

Apr 26 2026 2:21 AM | Updated on Apr 26 2026 2:21 AM

కల్వకుర్తి: రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో ఒక మెట్టు దిగి.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు అంగీకారంతో ప్రజాపాలన అర్థాన్ని చాటడంతో పాటు కార్మికులను గెలిపించిందని నాగర్‌కర్నూల్‌ ఎంపీ డా.మల్లు రవి అన్నారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రత్నమాల స్వగృహంలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులు కార్మికులతో చర్చించి.. వారి డిమాండ్లకు ఆమోద ముద్ర వేసిందన్నారు. గతంలో 55 రోజులపాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే నియంతలా వ్యవహరించిన మాజీ సీఎం కేసీఆర్‌ పార్టీ నాయకులు ప్రస్తుతం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. డబుల్‌బెడ్రూం ఇళ్ల పేరుతో రెండుమార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పకడ్బందీగా అమలుచేసేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. సమావేశంలో రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సభ్యుడు బాలాజీ సింగ్‌, మాజీ సర్పంచ్‌ ఆనంద్‌ కుమార్‌, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి శ్రీకాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement