నేటినుంచి 69వ జాతీయస్థాయి అండర్–17 బాలుర క్రికెట్ టోర్నీ
● పాల్గొననున్న 31 రాష్ట్రాల జట్లు
● ఇప్పటికే జడ్చర్ల చేరుకున్న 28 జట్లు
జడ్చర్ల టౌన్: పాలమూరు వేదికగా మరోసారి జాతీయ స్థాయి క్రీడాపోటీలు జరగనున్నాయి. జడ్చర్ల, మహబూబ్‌నగర్ కేంద్రాల్లో ఆదివారం నుంచి 69వ ఎస్‌జీఎఫ్ జాతీయ అండర్–17 బాలుర క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 31 జట్లు పాల్గొంటుండగా.. ఇప్పటికే 28 రాష్ట్రాల జట్లు జడ్చర్లకు చేరుకున్నాయి. నేటి ఉదయం వరకు మిగిలిన మూడు జట్లు రానున్నాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్‌లకు జడ్చర్ల బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఘన స్వాగతం పలికారు. స్వామినారాయణ గురుకుల పాఠశాలలో వీరికి బస ఏర్పాటు చేశారు. జడ్చర్ల మినీ స్టేడియంలో టోర్నీ ప్రారంభం కానుంది. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హాజరుకాన్నారు.
డీఈఓ పరిశీలన..
మెగా టోర్నీ ఏర్పాట్లను డీఈఓ ప్రవీణ్‌కుమార్ పర్యవేక్షించారు. స్వామి నారాయణ గురుకులానికి చేరుకుని ఇతర రాష్ట్రాల క్రీడాకారులతో మాట్లాడారు. వారికి కల్పించిన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్, వసతిపై ఆరా తీశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్న జడ్చర్ల మినీ స్టేడియాన్ని పరిశీలించారు. ఆయన వెంట టోర్నీ కన్వీనర్ మంజులాదేవి, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి శారదబాయి ఉన్నారు.
31 జట్లు.. 61 మ్యాచ్‌లు..
టోర్నమెంట్‌ను లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో 20–20 ఓవర్ల విధానంలో 61 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. 31 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఏడు గ్రూప్‌లో నాలుగేసి జట్లు ఉంటాయి. ఒక్క గ్రూప్‌లో మాత్రం మూడే జట్లు ఉంటాయి. డ్రా ద్వారా గ్రూప్‌లను విభజిస్తారు. ఆయా గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఎనిమిది జట్లు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంటాయి. మ్యాచ్‌లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. మ్యాచ్‌లు జరిగే మైదానాల్లో మ్యాట్‌లు వేశారు.క్రీడాకారులు ఇబ్బందులు పడకుండా ఉండేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మ్యాచ్‌లు తిలకించేందుకు వచ్చే వారి కోసం సైతం మైదానాల వద్ద తాగునీటిని ఏర్పాటు చేస్తున్నారు.


