గట్టు: మహిళలు స్వశక్తితో ఎదిగి ఆర్థికంగా బలపడాలని డీఆర్డీఓ ముసాయిదాబేగం సూచించారు. గట్టు మండల మహిళా సమాఖ్యలో శనివారం డబ్ల్యూసీఎంఓ సంస్థ ఆధ్వర్యంలో మహిళలు, బాలికలకు స్వయం ఉపాధి, డ్రైవింగ్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ.. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు సైకిల్ డ్రెవింగ్ నేర్చుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ తప్పనిసరిగా స్వయం సహాయక మహిళా సంఘాల్లో సభ్యత్వం తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాసులు, ఎంపీడీఓ చెన్నయ్య, ఏపీఎం మారుతి, మహిళా సమాఖ్య ప్రతినిధులు వెంకటేశ్వరి, అక్షర, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జయభారతి, శ్రీవల్లి, జానెల్లి పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.6,789
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శనివారం 278 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 6,789, కనిష్టంగా రూ. 3,880, సరాసరి రూ. 5,899 ధర పలికింది. అదే విధంగా 118 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,091, కనిష్టంగా రూ. 5,759, సరాసరి రూ. 5,919 ధర లభించింది. 2,119 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,306, కనిష్టంగా రూ. 1,771, సరాసరి రూ. 2,009 ధర పలికింది.
శనేశ్వరుడికి
ప్రత్యేక పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ శనేశ్వరాలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శనిదోష నివారణ కోసం ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి భక్తుల చేత జిల్లేడు పూలు, తిలతైలాభిషేక పూజలు చేశారు. లింగదర్శనం అనంతరం భక్తులకు ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


