గద్వాల క్రైం: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడోరోజుకు చేరింది. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేదిలేదని ఆర్టీసీ కార్మికులు భీష్మించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించాలని నినదించారు. కండక్టర్ శంకర్‌గౌడు ఆత్మబలిదానం చేసుకున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదని విమర్శించారు. కార్మికులు అవినీతికి తావు లేకుండా ప్రగతి చక్రాలు పరుగులు పెడితేనే సంస్థ మనుగడ సాధిస్తుందన్న విషయం మరువొద్దన్నారు.
ఎమ్మెల్యే బండ్ల మద్దతు..
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటులో ఆర్టీసీ కార్మికులు కీలకంగా వ్యవహరించారన్నారు. వేలాది మంది కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పదించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా అందించాలని పేర్కొన్నారు. బాధిత కార్మికుడి కుటుంబానికి తన తరపున రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తానని కార్మికుల సమక్షంలో ప్రకటించారు. కార్మికుల సమ్మెకు అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. మూడోరోజు సమ్మెలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా 58కు పైగా బస్సులను నడిపించినట్లు డిపో మేనేజర్ సునీత వెల్లడించారు.
ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో
కొనసాగిన ఆందోళనలు
అరకొరగానే బస్సులు..
ప్రయాణికుల తిప్పలు
మద్దుతు తెలిపిన ఎమ్మెల్యే బండ్ల.. రూ.లక్ష ఆర్థిక సహాయం ప్రకటన


