● రెండోరోజు సమ్మెలోనే ఆర్టీసీ కార్మికులు
● ప్రైవేట్ సిబ్బందితో కొనసాగిన సర్వీసులు
● భద్రత కల్పించిన పోలీసులు
● మద్దతు తెలిపిన అఖిలపక్ష నాయకులు
గద్వాల క్రైం: ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ.. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు గురువారం రెండోరోజు సైతం గద్వాల డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ అమలు చేయకుండా తమను నిర్లక్ష్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందన్నారు. ఏళ్ల తరబడి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను విస్మరించడం సమంజసం కాదని నినదించారు. కార్మికుల సమ్మెకు అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. కార్మికులను ప్రతి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆర్టీసీ కార్మికులు సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. ఉద్యమ పార్టీగా ప్రభుత్వంలోకి వచ్చిన ప్రభుత్వం సైతం కార్మికులను విస్మరించదన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పూర్తిస్థాయిలో మద్దతు ఉంటుందని వివరించారు. అయితే రెండోరోజు సమ్మెలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా 50కిపైగా బస్సు సర్వీసులను డిపో మేనేజర్ సునీత అందుబాటులోకి తీసుకువచ్చారు. గమ్యస్థానాలకు వెళ్లే బస్సులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రైవేట్ సిబ్బందితో బస్సులు నడిపించారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సులు లేకపోవడంతో ఆటోలు, జీపులలో రాకపోకలు సాగించారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో డిపోకు రెండోరోజు రూ.7 లక్షల నష్టం వాటిల్లింది.
రీజియన్‌లో 426 నడిచిన బస్సులు
రెండు రోజు గురువారం మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు 925 బస్సులకుగాను 426 బస్సులు మాత్రమే నడిచాయి. 57 ఆర్టీసీ బస్సులు, 346 ప్రైవేట్ హైర్ బస్సులు, 23 ఈవీ బస్సులు నడిచాయి.


