ప్రతి గింజను ప్రభుత్వమే కొనాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి గింజను ప్రభుత్వమే కొనాలి

Apr 24 2026 6:20 AM | Updated on Apr 24 2026 6:20 AM

రాజోళి: అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలో ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం మండలంలోని మాన్‌దొడ్డి, పచ్చర్ల గ్రామాల్లో ఆయన పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అకాల వర్షానికి దెబ్బతినడం చాలా బాధాకరమన్నారు. పొలాల్లో ఉన్న పంటలు దెబ్బతింటే అది ప్రకృతి నష్టంగా రైతులు భావించారని, కానీ, అమ్మకానికి తీసుకెళ్లిన మొక్కజొన్న ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తడిసిపోయిందన్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర రోజుల తరబడి ధాన్యం కుప్పలుగా ఉంచినా గన్నీ బ్యాగులు లేక కొనలేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలని కోరారు.

నేడు కోఆప్షన్‌ ఎన్నిక

అయిజ: మున్సిపాలిటీలో శుక్రవారం కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌ సైదులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలోని సమావేశ మందిరంలో నిర్వహించే కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు కౌన్సిలర్లు, సంబంధిత ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.

బీచుపల్లి ఆలయ ఈఓగా పురేందర్‌

ఎర్రవల్లి: బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయ ఈఓగా పురేందర్‌కుమార్‌ను నియమిస్తూ గురువారం దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇక్కడ ఇన్‌చార్జి ఈఓగా విధులు నిర్వహిస్తున్న రామన్‌గౌడ్‌ బదిలీపై పొన్నకల్‌ ఆలయానికి వెళ్లడంతో ఆయన స్థా నంలో ప్రస్తుత జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయ ఈఓగా విధులు నిర్వహిస్తున్న పురేందర్‌కు ఇన్‌చార్జి ఈఓగా బాధ్యతలు అప్పగించింది.

204 క్వింటాళ్ల

వేరుశనగ రాక

గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు గురువారం 204 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్టంగా రూ.6,606, కనిష్టంగా రూ.4,409, సరాసరిగా రూ.5,819 ధరలు లభించాయి. 124 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,069, కనిష్టంగా రూ.3,301, సరాసరిగా రూ.5,931 చొప్పున పలికాయి. 13 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,519, కనిష్టంగా రూ.5,219, సరాసరిగా రూ.6,219 ధరలు వచ్చాయి. 1,530 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,308, కనిష్టంగా రూ.1,809, సరాసరిగా రూ.2,069 ధరలు లభించాయి.

డ్రైవర్‌, కండక్టర్లు కావాలి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: టీజీఎస్‌ఆర్టీసీలో ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె జరుగుతున్న నేపథ్యంలో సమ్మెకాలంలో పనిచేసేందుకు డ్రైవర్‌, కండక్టర్‌ అభ్యర్థుల నుంచి అత్యవసరంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ సంతోష్‌కుమార్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న డ్రైవర్‌ అభ్యర్థులకు రోజుకు రూ.1000 చొప్పున, కండక్టర్‌ అభ్యర్థులకు రోజు రూ.800 చొప్పున పారితోషికం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అచ్చంపేట, గద్వాల, కల్వకుర్తి, కొల్లాపూర్‌, కోస్గి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, షాద్‌నగర్‌, వనపర్తిల నుంచి ఆసక్తిగల అభ్యర్థులు తమ సమీప డిపో మేనేజర్‌ లేదా మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, జిల్లా రవాణా అధికారులను సంప్రదించాలని కోరారు. డ్రైవర్‌ అభ్యర్థులకు తెలుగులో రాయడం, చదవడం, హెవీ ట్రాన్స్‌పోర్టు వెహికల్‌ లైసెన్స్‌ లేదా హెవీ గూడ్స్‌ వెహికల్‌ లైసెన్స్‌ లేదా హెవీ ప్యాసింజర్‌ వెహికల్‌ లైసెన్స్‌ (18 నెలల అనుభవంతో), 25 నుంచి 50 ఏళ్లలోపు, అదే విధంగా కండక్టర్‌ అభ్యర్థులకు ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత, 21 నుంచి 58 ఏళ్లలోపు అర్హులని తెలిపారు.

నేడు సంసద్‌ ఖేల్‌ మహోత్సవ్‌ ముగింపు

హాజరవుతున్న గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

మహబూబ్‌నగర్‌ క్రీడలు: మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలో ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్‌ఖేల్‌ మహోత్సవ ముగింపు వేడుకలను జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. అలాగే అతిథులుగా అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్‌, గొంగిడి త్రిషారెడ్డి, డబ్ల్యూపీఏల్‌ మహిళా క్రికెటర్‌ త్రిషా పూజితలు హాజరుకానున్నారు. ముగింపు వేడుకల సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాగా.. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, పీఎంఎస్‌కేఎం పార్లమెంట్‌ ఇన్‌చార్జి జనార్దన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్‌ కిరణ్‌కుమార్‌, నవీన్‌కుమార్‌రెడ్డి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement